తెదేపా ఎంపీ అభ్యర్థులు వీరే-రాజకీయ-03/09

*తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా పోటీచేసే అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇప్పటికే అభ్యర్ధుల పేర్లపై అధినేత ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు కొందరు నాయకులు. అయితే అరడజను సీట్లలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలో చేరికలు, సీనియర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారిపై స్పష్టత రానుంది. శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయనగరం – అశోకగజపతి రాజు అరకు – కిషోర్ చంద్రదేవ్ అనకాపల్లి – కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్ విశాఖపట్నం – భరత్ కాకినాడ – చెలమలశెట్టి సునీల్ అమలాపురం – హరీష్ ( బాలయోగి కుమారుడు) రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ ఏలూరు – మాగంటి బాబు నర్పాపురం – కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా సీతా మహాలక్ష్మి బందరు – కొనకళ్ల నారాయణ లేదా మరొకరు విజయవాడ – కేశినేని నాని గుంటూరు – గల్లా జయదేవ్ బాపట్ల – మల్యాద్రి లేదా కొత్త అభ్యర్ధి నర్సారావుపేట – లగడపాటి రాజగోపాల్ ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు అనాసక్తి కొత్తవారికి అవకాశం? మాజీ డీజీపీ పేరు? నెల్లూరు – పెండింగ్ తిరుపతి – జూపూ డి ప్రభాకర్ రావు చిత్తూరు – శివప్రసాద్ కడప – ఆదినారాయణ రెడ్డి రాజంపేట – డి.కె.శ్రీనివాస్ లేదా బలిజ వర్గానికి చెందిన నాయకుడు అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి లేదా వారసుడు పవన్ హిందూపురం – నిమ్మల కిష్టప్ప నంద్యాల – శివానందరెడ్డి లేదా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కర్నూలు – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.
*వైకాపా ఎమ్మెల్యే అరెస్ట్‌
వైకాపాకు చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని వైకాపా కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించారు. దీంతో వైకాపా కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.అంతకుముందు వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు తమ అనుచరులతో కలిసి చేరుకుని సీఐ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. తమ అనుచరలను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
*గులాబీ గూటికి మరో ఎమ్మెల్యే!
అటు పార్లమెంటు, ఇటు మండలి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు తెలిసింది.ఈ సందర్భంగా ఆయన తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపగా సీఎం ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పినపాక, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కులు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరికొందరి పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈనెల 2న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందుకు చిరుమర్తి లింగయ్య గైర్హాజరు కావడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
* పార్లమెంటు ఎన్నికల్లోనూ ‘ప్రవాస’ సేవలు
శాసనసభ ఎన్నికల మాదిరే పార్లమెంటు ఎన్నికల్లోనూ తెరాస ప్రవాస విభాగాలు రాష్ట్రంలో సేవలందించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. ఈ విభాగం సమన్వయకర్త మహేశ్‌ బిగాల, ఇతర ప్రతినిధులు శుక్రవారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వాటి పని తీరును వివరించారు. 40 దేశాల్లో శాఖలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా సేవా కార్యక్రమాలను, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల్లో తెరాస గెలుపునకు ప్రవాస విభాగాలు కృషి చేయాలని సూచించారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి తెరాస కృషి చేస్తోందని వెల్లడించారు.
*పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధం- కిషన్‌రెడ్డి
పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… దేశంలో టీఆర్‌ఎస్‌ చక్రం తిప్పుతుందని కేటీఆర్‌ అనడం హాస్యాస్పదమన్నారు. కేంద్రాన్ని విమర్శించడంలో కేటీఆర్‌, చంద్రబాబు పోటీ పడుతున్నారని, ఐదేళ్లుగా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని ఆయన అన్నారు. అలాగే కేంద్రం ఇచ్చే నిధులను గ్రామాలకు మళ్లిస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
*ఏప్రిల్‌ నుంచి రూ.2వేలు పింఛన్‌-వనపర్తి సభలో కేటీఆర్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రెండో హరిత విప్లవానికి కేసీఆర్‌ నాంది పలికారని చెప్పారు. ఏప్రిల్‌ నుంచి పింఛన్‌ రెట్టింపు చేసి రూ.2,016 వేలు ఇస్తామని వెల్లడించారు. 57 ఏళ్లకే ఆసరా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. వనపర్తిలో నిర్వహించిన తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ శనివారం మాట్లాడారు.
*బాహుబలి’ని మించిన కుట్ర ఇది: చంద్రబాబు
రాష్ట్రంపై యథేచ్ఛగా కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపాను నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు. డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
*జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోదుగుల
కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వలసలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార, ప్రతిపక్షాల్లో చేరిపోగా, మరికొందరు వారి బాటలో పయనించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి మోదుగులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
*ఏపీనే మాకు బాకీ
తమకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వడం మానేసి.. తామే బాకీ ఉన్నట్లు ఏపీ సర్కారు దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఇక్కడి నుంచి అక్కడికి చెల్లించాల్సిన లెక్కలన్నీ చూస్తే ఇంకా తెలంగాణకే అక్కడి నుంచి రూ. 2,406 కోట్లు రావాలి. కానీ తెలంగాణ నుంచి రూ. 5,600 కోట్లు రావాలని ఏపీ విద్యుత్‌ సంస్థలు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)కి వెళ్లాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావులతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*తెలంగాణ తొవ్వతో దేశానికి బువ్వ
‘‘పశ్చిమబెంగాల్‌ ఈ రోజు ఏం ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచిస్తుందని గతంలో గొప్పగా చెప్పుకునేవారు. కానీ, నేడు తెలంగాణ ఏం చేస్తుందో రేపు దేశం అదే చేస్తుందన్నట్లుగా పరిస్థితి మారింది. దార్శనికుడైన సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులతో ఇది సాధ్యమైంది’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఒక ఉద్యమకారుడు గొప్ప పరిపాలనాదక్షుడిగా మారిన తీరును ప్రత్యర్థులు సైతం మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌ పట్టణంలో నిర్వహించిన మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ, కొంపల్లిలో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
*వైకాపా అధ్యక్షుడిలా కేసీఆర్‌
‘‘వైకాపా అధ్యక్షుడిగా కేసీఆర్‌.. రెండు పార్టీలకు ఉమ్మడి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పని చేస్తున్నారు. జగన్‌ను తెరాసకు డమ్మీగా చేశారు.’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ..తెరాస బాగా డబ్బులున్న పార్టీ. కేసీఆర్‌ వైకాపాకి పెట్టుబడి పెడుతున్నారని ఆరోపించారు. ‘‘ముందు కేసీఆర్‌ పెట్టుబడి పెడతారు. తర్వాత జగన్‌ కప్పం కడతారు. తెరాస ఇచ్చే డబ్బులతో జగన్‌ ఎన్నికల్లో రూ.వెయ్యి, రూ.రెండు వేలు పంచుతారు.
*నామినేషన్‌ ఉపసంహరణ..స్పృహ తప్పిన అభ్యర్థి
ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజన్యాల సంఘం(ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌కు చెందిన యాదగిరి శేఖర్‌రావు తెరాస అధిష్ఠానం ఆదేశాలతో శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడి స్పృహతప్పి పడిపోయారు. శేఖర్‌రావు, విశ్రాంత డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌ తెరాస మద్దతు కోసం ఆశావహులుగా నిలిచి ఎమ్మెల్సీ బరిలో ఉండేందుకు నామినేషన్లను వేశారు.
*మైసూరు ఎంపీకి కోర్టు కస్టడీ
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణకు గైర్హాజరైన మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహ(భాజపా)కు చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జామీను రహిత వారెంటు జారీ చేసింది. శుక్రవారం ఆ ఉత్తర్వులు వెలువడుతున్న సమయానికి ఎంపీ న్యాయాలయానికి చేరుకోగా అదుపులోకి తీసుకుని, కోర్టు హాల్‌ వెలుపల ఉంచాలని న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్ర డి.హుద్దార్‌ పోలీసులను ఆదేశించారు.
*భాజపా ప్రచారం ‘మాడిసన్‌ మీడియా’కు!
రానున్న జాతీయ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేపట్టడానికి సామ్‌ బల్సారా నేతృత్వంలోని ‘‘మాడిసన్‌ మీడియా’’ను భాజపా పునఃనియమించుకుంది. ప్రింట్‌, డిజిటల్‌, టీవీ, రేడియోలో సహా భాజపా తరఫున అన్నిరకాలుగా ప్రచారం చేయడానికిగాను ఈ సంస్థకు రూ.500 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ భాజపా తరఫున ఈ మీడియా దిగ్గజం ప్రచారబాధ్యతలు చేపట్టింది. మాడిసన్‌తో పాటు ఇప్పటికే భాజపా ప్రచార బాధ్యతలను ‘‘ఒగిల్వి, మేథర్‌’’ అనే మరో కంపెనీకి సైతం అప్పగించారు. ఈ కంపెనీ అధినేత పియూష్‌ పాండే 2014లో రూపొందించిన నినాదం ‘‘అబ్‌ కీ బార్‌ మోడి సర్కార్‌’’ (ఈసారి మోదీ సర్కారు వంతు) జనసామాన్యంలోకి బాగా చొచ్చుకుపోయింది.
*ఆదాయపన్ను అధికారుల అదుపులో ‘ఆప్‌’ ఎమ్మెల్యే
ఓ స్థిరాస్తి వ్యాపారి వద్ద లభించిన రూ.రెండుకోట్లకు పైగా నగదు వ్యవహారంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) శాసనసభ్యుడు నరేష్‌ బాల్యన్‌ను ఆదాయపన్ను అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారికి సంబంధించిన వివరాలను సర్వే చేస్తున్నప్పుడు వెలుగుచూసిన ఈ నగదు సదరు ఎమ్మెల్యే, ఆయన సహచరులకు సంబంధించినదన్న నేపథ్యంలో వారు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
*భాజపాను ఓడించడమే లక్ష్యం
భాజపా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, అది మళ్లీ రాకూడదన్నదే తమ లక్ష్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశాల వివరాలను జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి శుక్రవారం ఆయన దిల్లీ విలేకరులకు తెలిపారు. నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, దేశ సరిహద్దుల్లో రక్షణ, ఉగ్రవాద నిర్మూలన.. ఇలా అన్నింటిలోనూ నరేంద్ర మోదీ సర్కారు వైఫల్యాన్ని చవిచూసిందన్నారు.
*ఎమ్మెల్సీగా ప్రభాకర్‌ ఏకగ్రీవం
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార తెరాస తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావుకు పోటీగా ఎవరూ నామపత్రాలు దాఖలు చేయకపోవడంతో, ఎన్నిక ఏకగ్రీవమని ప్రకటిస్తూ శుక్రవారం సంబంధిత అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్‌ ధ్రువపత్రం అందజేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, కార్పొరేటర్‌ బంగారి ప్రకాష్‌ విజేతకు శుభాకాంక్షలు తెలిపారు.
*ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉగ్రవాదులతో పోల్చారంటూ తెరాస నాయకుడు దినేష్‌ చౌదరి శుక్రవారం ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించామని, న్యాయ సలహా తీసుకుని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.
*భాజపా హయాంలో చిన్నచిన్న కారణాలతోనే ముస్లింలపై దాడులు: మమత
గోమాంసం తినడం, లవ్‌ జిహాద్‌ వంటి చిన్నచిన్న కారణాలపై భాజపా పాలనలో ముస్లింలపై దాడులు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు తన తాజా పుస్తకం ‘ఇండియా ఇన్‌ డిస్ట్రెస్‌’లో పేర్కొన్నారు. దీన్ని శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. భారత్‌లో లౌకిక, అహింసాయుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని, మతపరమైన ఛాందసవాద దేశంగా మార్చేస్తున్నారని మమత ఈ పుస్తకంలో ఆరోపించారు.
*గుజరాత్‌లో భాజపా గూటికి ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిలో జవహర్‌ చావడా గాంధీనగర్‌లో భాజపా ప్రధాన కార్యాలయానికి వెళ్లి, అక్కడ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఎమ్మెల్యే పర్సోత్తమ్‌ సబారియా కూడా త్వరలోనే భాజపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పర్సోత్తమ్‌ గత ఏడాది సాగునీటి కుంభకోణంలో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
*అధికారమిస్తే మహిళలకు 33 శాతం పదవులు
‘ప్రత్యేక తెలంగాణ కోసం, రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసినప్పుడు మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కోసం ఎందుకు ఉద్యమం చేయకూడదు. మహిళలు ముందుకొచ్చి ఉద్యమం చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుంద’ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘మహిళల మాన ప్రాణ సంరక్షణ, సాధికారతే లక్ష్యంగా జనసేన పార్టీ పని చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాయి. కానీ దాని కోసం నిర్ణయాత్మకమైన ఆలోచనా విధానాన్ని అమలు చేయటం లేదు. అధికారంలోకి వచ్చిన తరవాత కచ్చితంగా మహిళలకు 33 శాతం పదవులిస్తాం.’’అని పవన్‌ వ్యాఖ్యానించారు.
*నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడే
విశాఖ జిల్లాలోని మెజార్టీ శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఖరారు చేశారు. రాత్రి 12.45 గంటల సమయానికి జిల్లాలోని 8మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఆయన మళ్లీ టిక్కెట్‌లు ఖాయం చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మళ్లీ నర్సీపట్నం నుంచే పోటీ చేయనున్నారు. అయ్యన్నపాత్రుడు పోటీకి విముఖత వ్యక్తం చేసినా ఆయనే పోటీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు.
*పక్కదోవ పట్టించేందుకే డేటా కుట్ర
‘ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు, ప్రత్యేక హోదా తదితర అంశాలను పక్కదోవ పట్టించేందుకే డేటా కుట్రను తెరపైకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లో జరుగుతోంది. తొలుత ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆర్‌ తెలంగాణలో చేపట్టారు. నిజమో కాదో ఆయనే చెప్పాలి’ అని సినీనటుడు శివాజీ ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఓట్ల తొలగింపునకు సంబంధించి ఆర్టీఐ ద్వారా ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న సమాచారంతో మాట్లాడుతున్నాను.
*వైకాపాలోకి వ్యాపారులు, మాజీ ఎమ్మెల్యేలు
ఇద్దరు వ్యాపారవేత్తలు, తెదేపాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం వైకాపాలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో వేర్వేరుగా కలిసి పార్టీలో చేరారు. ఎంఎంఆర్‌ గ్రూపు సంస్థల ఛైర్మన్‌, ప్రకాశం జిల్లాకు చెందిన మన్నెం మధుసూదనరావు (ఎంఎంఆర్‌) పార్టీలో చేరారు.
*గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.రామసుబ్బారెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేయడంతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ రెండు స్థానాలకు శమంతకమణి, సీహెచ్‌ శివనాథరెడ్డిలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్‌ పేరుతో నోటిఫికేషన్‌ ఇవ్వగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
*ఏపీ ఓటర్ల జాబితాను పునఃసవరించాలి
ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాను పునః సవరించాలని…డాటా చోరీపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లవాసా, సుశీల్‌ చంద్రలను భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు వి.మురళీధరన్‌ శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెదేపా విపక్ష పార్టీలకు చెందిన ఓట్లను తొలగించి, అనుకూల ఓట్లను నమోదు చేయించిందని ఫిర్యాదు చేశారు.
*జగన్‌, వైకాపా తీరుపై ఫిర్యాదు చేయనున్న తెదేపా
వైకాపా వ్యవహారశైలి, జగన్‌ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సమయం కేటాయించాలని తెదేపా నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కోరారు. ఆయన సమయం ఇచ్చినప్పుడు తెదేపా నాయకులు వెళ్లి తాజా అంశాల్లో వైకాపా తీరు, జగన్‌ తీరుపై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం.
* రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా, ప్రతిపక్ష వైకాపా ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థకు ఓటర్ల డేటా చేరడం తగదన్నారు. తెదేపా తమ కార్యకర్తల సమాచారాన్ని వైకాపా దొంగిలించిందని ఆరోపిస్తుండగా…తమ కార్యకర్తలను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వైకాపా ఆరోపిస్తోందన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా దీనిపై సిట్‌ విచారణకు ఆదేశించడం వల్ల రాష్ట్రాల మధ్య వివాదానికి తెర తీసినట్లయిందన్నారు. తెదేపా, వైకాపాలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని.. జనసేన, సీపీఐ, సీపీఎం కూటమిని గెలిపించాలని కోరారు. రఫేల్‌ కుంభకోణం వెనుక ప్రధాని నరేంద్రమోదీ సహకారం ఉందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
*పాక్ సెనేట్ సమావేశానికి హిందూ మహిళా సెనేటర్ సారధ్యం
పాకిస్థాన్ తోలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణకుమారి కోహ్లి శుక్రవారం జరిగిన పార్లమెంటు సమావేశానికి సారద్యం వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపద్యంలో ఆమెకే శుక్రవారం నాటి సమావేశానికి సారద్య బాద్యతలు అప్పగించాలని సెనేట్ చేఇర్మన్ నిర్ణయించినట్లు సెనేటర్ ఫైజల్ జావేద్ అంతకుముందే ట్విట్టర్ ద్వారా తెలిపారు. సింద్ ప్రావీన్స్ కు చెందిన మారుమూల గ్రామం ధారి హిందూ సామాజిక వర్గానికి చెందిన కృష్ణకుమారి ఓ నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వారు.

More News

One thought on “తెదేపా ఎంపీ అభ్యర్థులు వీరే-రాజకీయ-03/09

  1. K.KENNEDY

    ఎక్సట్రార్డినరీ న్యూ తెలుగు న్యూస్ ఇంటర్నేషనల్
    థాంక్స్
    క్
    కే.కెన్నెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com