NRI-NRT

అమెరికా మిగులు వ్యాక్సిన్లు ఇండియాకు ఇస్తారా?-తాజావార్తలు

Breaking News - Will US Donate Surplus Vaccines To India?

* అమెరికాలో ఉన్న మిగులు వ్యాక్సిన్లను కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు విడుదల చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బైడెన్‌ ప్రభుత్వంపై పలువురు కీలక వ్యక్తులు స్వరం పెంచారు. చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్న సమయంలో టీకాలను గిడ్డంగుల్ని ఉంచడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు వాటిని అవసరమైన చోటికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఇప్పటికే 40 మిలియన్‌ డోసుల ఆస్ట్రాజెనెకా టీకాలు ఉన్నాయన్నారు. వాటిని ప్రస్తుతం వినియోగించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆయా దేశాలకు ఆ వ్యాక్సిన్లను విడుదల చేయాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు.

* దేశంలోనే తొలి ఆక్సిజన్‌ రైలును కొవిడ్‌ ఆస్పత్రులకు పంపించిన విశాఖ ఉక్కు పరిశ్రమ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధుతో ప్రచార చిత్రం రూపొందించింది. ఈ సందర్భంగా సింధు మాట్టాడుతూ.. అత్యంత కష్ట సమయంలో ప్రాణవాయువు అందిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అభినందించింది. సంస్థ కృషిని దేశం మరవబోదంటూ ప్రశంసించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరును గౌరవిస్తూ ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. ధైర్యంగా కొవిడ్‌ను ఎదుర్కోవాలని సింధు పేర్కొంది. అందరూ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చింది.

* దేశ రాజధాని దిల్లీలో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రకటించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటం.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి దయనీయ పరిస్థితులు తలెత్తుతుండటంతో వారం రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ను మరో వారం పెంచారు.

* కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు పొరుగు దేశం పాకిస్థాన్‌ తనవంతు సాయం అందించేందుకు సిద్ధమయింది. భారత్‌కు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ట్విటర్‌లో వెల్లడించారు.

* చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించడమే కాదు, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును బెంబేలెత్తించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ విజయం వైపు పరుగెడుతున్నట్లు అనిపించలేదు. ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(34; 15 బంతుల్లో 4క్ష్4, 2క్ష్6), మాక్స్‌వెల్‌(22; 15 బంతుల్లో 3క్ష్4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరిలో చాహల్‌ (8), సిరాజ్‌ (12) నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చెన్నై బౌలర్లలో జడేజా 3, ఇమ్రాన్‌ తాహిర్‌ 2, సామ్‌కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ తీశారు.

* దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ స్పందించారు. ‘యంత్రాంగం విఫలమైంది. జన్‌ కీ బాత్‌ గురించి మాట్లాడాల్సిన సమయమిది’ అని ట్వీట్‌ చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి బాధ్యతాయుతమైన పౌరులు అవసరమన్న రాహుల్‌.. రాజకీయ పనులను పక్కనపెట్టి అవసరాల్లో ఉన్న దేశ ప్రజలకు సాయమందించాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. ఇది కాంగ్రెస్‌ ధర్మమని పేర్కొన్నారు.

* ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. మాఘమాసంలో నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సమ్మక్క-సారలమ్మ మహాజాతరను నిర్వహిస్తారు. 2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు.► ఫిబ్రవరి 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.► ఫిబ్రవరి 17 – చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.► ఫిబ్రవరి 18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.► ఫిబ్రవరి 19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు.

* రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్‌-2020 సర్టిఫికెట్ల పరిశీలన రెండో దశ ప్రక్రియను వాయిదా వేసినట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిశీలించి ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేశామన్నారు. మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు అటెస్టెడ్‌ స్కానింగ్‌ మార్కుల జాబితాను సభ్య కార్యదర్శికి ఈమెయిల్‌ ద్వారా పంపించాలని సూచించారు. పూర్తి సమాచారం ఏపీసెట్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు.

* హర్ష టయోట సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ ఇన్నోవా కారు విరాళంగా ఇచ్చింది. ఆ సంస్థ తరఫున తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి కారును అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించి తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు అప్పగించారు.

* తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. సమాచారం తెలుసుకుని శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. అయితే తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని స్థానిక తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. పల్లా శ్రీనివాస్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.