NRI-NRT

అమెరికా విమాన టికెట్లకు భారీ రెక్కలు

అమెరికా విమాన టికెట్లకు భారీ రెక్కలు

అత్యవసరం అయితే తప్ప భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని అమెరికా సూచించిన నేపథ్యంలో ఈ రూట్లలో తిరిగే విమాన టికెట్‌ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో భారత్‌-అమెరికా సర్వీసుల్లో ఎకానమీ క్లాస్‌ టికెట్‌ సగటున రూ.50 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్న భయంతో చాలామంది అమెరికాకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్‌ ఏర్పడి రేట్లు పెరిగాయి. జర్మనీ, యూకే, యూఏఈ సహా మరికొన్ని దేశాలు కూడా భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. మరోవైపు దేశంలో ఛార్టర్డ్‌ విమానాలకు అధిక డిమాండ్‌ ఏర్పడిందని ముంబయిలోని ఓ విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. కరోనా సోకిన సంపన్నులు ఎయిర్‌ అంబులెన్స్‌గా ఛార్టర్డ్‌ ఫ్లైట్లు ఉపయోగిస్తున్నారని, దీంతో వీటి ఛార్జీలు కూడా రెట్టింపయ్యాయన్నారు.