Politics

తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ రాదేమో-తాజావార్తలు

తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ రాదేమో-తాజావార్తలు

* దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిపోతుండటంతో.. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రోజురోజుకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు విషయంలో రాష్ట్రాల మధ్యన పొరపొచ్చాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను తమ అవసరాలు తీరిన తర్వాతనే పొరుగు రాష్ట్రాలకు పంపించాలని భావిస్తున్నాయి. ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాసిన లేఖ ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత వేధిస్తోందని అందువల్ల తమ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ప్రాణవాయువును తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో 400 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్‌ టన్నులు ఖర్చవుతోందని లేఖలో పర్కొన్నారు. కానీ, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో భవిష్యత్‌లో 450 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్‌టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు.

* దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. ప్రధానంగా ఆక్సిజన్‌ కొరతను అధికమించలేకపోతోందని, వ్యాక్సిన్‌ ధరల నిర్ణయం విషయంలో చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మాటలకే పరిమితమవుతున్నారు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సోమవారం జరగబోయే ఎన్నికల్లో కరోనా బాధితులు కూడా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ‘‘కరోనా వైరస్‌ గురించి ఎలాంటి భయం అక్కర్లేదు. నేను మీ వాచ్‌మన్‌గా ఉంటాను‌’’ అని మమత ప్రజలకు భరోసా ఇచ్చారు. వర్చువల్‌గా నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎన్నికల ప్రచారాల కంటే కొవిడ్‌ ప్రచారసభలే ఎక్కువ నిర్వహించినట్లు చెప్పారు.

* రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్‌మార్కెట్‌లో ఆక్సిజన్‌ అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

* ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో సీఎం జగన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు మిస్‌ అవ్వకుండా చూస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు మృతి చెందడం పట్ల ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

* ఏపీలో ప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,041 నమూనాలను పరీక్షించగా.. 9,881 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా మహమ్మారితో 51 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది. తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 95,131 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నలుగురు, గుంటూరు, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

* ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చే మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ వేదికగా సహాయం కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌ బారినపడి చికిత్స కోసం అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావాలని, ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదంటూ, ఆక్సిజన్‌ సిలిండర్‌, ప్లాస్మా, ఆఖరికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు సైతం మంత్రి కేటీఆర్‌ను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉందని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

* కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది.తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా కరోనా బారిన పడిన జర్నలిస్టులకూ ఆర్థిక సాయం చేస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.

* కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నెలకొన్న విషమ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారనుందని లేఖలో వివరించారు. ఇంటర్‌, పది పరీక్షలకు సుమారు 16.3లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉందన్నారు.

* దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ దేశం మరోసారి కఠిన ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌ అమలు పరుస్తుండగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 14 రోజుల కఠిన కర్ఫ్యూ ప్రకటించింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ, బెంగళూరులో వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వైరస్‌ కట్టడి కాకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు.

* దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ(సెకండ్‌ వేవ్‌) విజృంభిస్తోన్న వేళ.. రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడంపై ఎన్నికల సంఘంపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సెకండ్‌ వేవ్‌ విజృంభణకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని పేర్కొంది. అంతేకాకుండా ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సి ఉంటుందని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓట్ల లెక్కింపు సమయంలో తన నియోజకవర్గంలో కొవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి చేసిన వినతిపై విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

* దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం లీగ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. లీగ్‌ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

* తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులున్నాయని.. వైరస్‌ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. తిరుపతిలోని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు.

* దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆర్మీ చేస్తోన్న సన్నద్ధతపై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సమయంలో ఆర్మీ చేపడుతున్న చర్యలను జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రధానికి వివరించారు. ముఖ్యంగా రెండేళ్ల క్రితం రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సీడీఎస్‌ చీఫ్‌ ప్రధానికి తెలిపారు. వీరితో పాటు అంతకుముందు రిటైరైన వారి సేవలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

* కరోనా విపత్కర పరిస్థితుల్లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారులకు 2 నెలలపాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 88 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లబ్ధి అందని 59 లక్షల కార్డు దారులకు మే, జూన్‌ నెలలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. రేషన్‌ వాహనాల ద్వారానే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి డబుల్‌ కోటాగా పంపిణీ చేయనున్నారు. బియ్యం పంపిణీ కోసం రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.