జీఎమ్మార్ చేతికి మరో విమానాశ్రయం-వాణిజ్య-03/12

* జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నాగ్‌పూర్‌ విమానాశ్రయ నిర్వహణ పనులను దక్కించుకుంది. ఈ మేరకు ఈ విమానాశ్రయాన్ని పర్యవేక్షిస్తున్న మిహాన్‌ ఇండియా నుంచి పనుల అనుమతి పత్రం (లెటర్‌ ఆఫ్‌ ఆర్డర్‌) పొందినట్లు జీఎంఆర్‌ బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది.
*వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,170, విజయవాడలో రూ.33,180, ప్రొద్దుటూరులో రూ.33,100, చెన్నైలో రూ.32,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,120, విజయవాడలో రూ.30,750, ప్రొద్దుటూరులో రూ.30,650, చెన్నైలో రూ.30,770గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,100, విజయవాడలో రూ.39,800, ప్రొద్దుటూరులో రూ.39,600, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.
*చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (సీఏ) పరీక్షలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వెల్లడించింది. వాస్తవానికి మే 2 నుంచి 17వ తేదీ వరకు సీఏ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే 17వ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మే 27 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ పేర్కొంది.
*మొబైల్‌ యాప్‌ సాయంతో ఎక్కడినుంచైనా ఆన్‌/ఆఫ్‌ చేయగలిగే ఎయిర్‌ కండీషనర్లను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఆవిష్కరించింది. స్మార్ట్‌ థిన్‌క్యూ సాంకేతికత కలిగిన 54 రకాల ఏసీలను 3-5 స్టార్‌రేటింగ్‌తో రూ.31,990-69,990 ధరల శ్రేణిలో సంస్థ దేశీయ విపణికి విడుదల చేసింది.
*దశాబ్ద కాలంలోనే తొలిసారిగా టర్కీ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. టర్కిష్‌ స్టాటిస్టిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీయూఐకే) ప్రకారం.. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఆర్థికాభివృద్ధి 2.4 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.
*నిధుల కొరతతో అల్లాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌లో మరో రూ.1,600-1,900 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ నిర్ణయించినట్లు సమాచారం. కంపెనీలో 24% వాటా ఎతిహాద్‌కు ఉన్న సంగతి విదితమే.
*సరికొత్త మోనోక్రోమ్‌ ఎకోట్యాంక్‌ ప్రింటర్లు 3 రకాలను విపణిలోకి విడుదల చేసినట్లు ఎప్సన్‌ తెలిపింది. కార్యాలయాల్లో వినియోగానికి అనువుగా ఆవిష్కరించిన ఎం 1100, ఎం 1120, ఎం 2140 ప్రింటర్లతో ఒక ప్రింట్‌నకు 12 పైసలే అవుతుందని సంస్థ తెలిపింది.
* ఆరోగ్య పానీయాల విభాగంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వినియోగదారుల అవసరాలను గుర్తించి, వారిని ఆకట్టుకునేందుకు వినూత్న ఉత్పత్తులను ప్రవేశ పెడుతున్నామని, ఇందులో భాగంగా రాగి, సబ్జా లస్సీలను విడుదల చేసినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు.
* దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకుగాను మేఘా ఇంజినీరింగ్‌ (ఎంఈఐఎల్‌) లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద క్లిష్టమైన పరిస్థితుల్లో ఏడు నెలల కాల వ్యవధిలోనే 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని ఈ సంస్థ పూర్తి చేసింది.
*బ్రిటన్‌ ప్రీమియం మోటర్‌సైకిళ్ల సంస్థ ట్రయంఫ్‌ తమ టైగర్‌ 800 ఎక్స్‌సీఏలో కొత్త వెర్షన్‌ను సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.15.17 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. టైగర్‌ 800 ఎక్స్‌సీఏ కొత్త వెర్షన్‌లో 200కు పైగా చాసిస్‌, ఇంజిన్‌ మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.
*పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎవరిది.. దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడిన ఈ అంశంలో ఆర్‌బీఐ బోర్డు ఏమంది.. వంటివి సహ చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెలుగులోకి వచ్చాయి.
*మార్కెట్లు కొనుగోళ్ల కళతో కళకళలాడాయి. దేశంలో వరుసగా రెండో సారీ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావొచ్చన్న అంచనాలతో సెన్సెక్స్‌ దాదాపు ఆరు నెలల గరిష్ఠానికి చేరింది.
*ఘజియాబాద్‌లోని యునికెమ్‌ లేబొరేటరీస్‌కు చెందిన ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తనిఖీలు పూర్తయ్యాయి.ఈ తనిఖీల్లో యూఎస్‌ఎఫ్‌డీఏ ఎటువంటి లోపాలను గుర్తించలేదని కంపెనీ వెల్లడించింది.
*కర్ణాటకలో చేపట్టబోయే ఓ రహదారి ప్రాజెక్టు నిమిత్తం రూ.1372 కోట్ల బిడ్‌కు అంగీకరిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అశోకా బిల్డ్‌కాన్‌ అనుబంధ సంస్థ అశోకా కన్‌సెషన్స్‌కు ఎల్‌ఓఏ (లెటర్‌ ఆఫ్‌ అవార్డు) లభించింది.
*కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌కు రూ.1,288 కోట్ల ఆర్డర్లు లభించాయి.
*ముంబయిలో హరిలాల్‌ భగవతి మున్సిపల్‌ జనరల్‌ హాస్పిటల్‌ పునర్నిర్మాణం నిమిత్తం కెపాసైట్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌కు రూ.483.81 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కింది.
*మహారాష్ట్రలో రూ.480.06 కోట్ల రహదారి ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ నుంచి దిలీప్‌ బిల్డ్‌కాన్‌కు ఎల్‌ఓఏ లభించింది.
*మలేరియా సహా కొన్ని ఆటోఇమ్యూన్‌ వ్యాధుల చికిత్సలో వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మందుబిళ్లల నిమిత్తం లారస్‌ ల్యాబ్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.
*గుజరాత్‌ స్టేట్‌ రోడ్‌వేస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి 1045 బస్సులు, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నుంచి 1000 వింగర్‌ అంబులెన్స్‌ల సరఫరాకు ఆర్డర్లు లభించాయని టాటా మోటార్స్‌ లభించింది.
8పలు మౌలిక ప్రాజెక్టుల నిమిత్తం రాయ్‌పుర్‌ స్మార్ట్‌ సిటీ నుంచి రూ.700 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు ఎన్‌బీసీసీ వెల్లడించింది.
*తమిళనాడులో గ్రీన్‌కోకు చెందిన పూవని పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో 46% వాటాను సీమెన్స్‌ ఫైనాన్షియల్‌ చేజిక్కించుకుంది.
*పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.226 కోట్లు సమీకరించే యోచనలో ఎంఎస్‌టీసీ ఉంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 13న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఒక్కో షేరుకు ఇష్యూ ధరగా రూ.121-128ని కంపెనీ నిర్ణయించింది.
*ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండు కింద రూ.1.40 (140%) ఇచ్చేందుకు టీవీఎస్‌ మోటార్‌ బోర్డు అంగీకారం తెలిపింది.
*ఎస్సార్‌ స్టీల్‌ను చేజిక్కించుకునేందుకు ఆర్సెల్లర్‌ మిత్తల్‌కు అనుమతినిస్తూ దిగువ దివాలా కోర్టు జారీ చేసిన ఆదేశాలపై ఎస్సార్‌ స్టీల్‌ మాజీ డైరెక్టర్లు నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com