Business

₹80వేల కోట్లు పన్ను చెల్లించనున్న శాంసంగ్-వాణిజ్యం

₹80వేల కోట్లు పన్ను చెల్లించనున్న శాంసంగ్-వాణిజ్యం

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ మాజీ ఛైర్మన్‌ లీ కున్‌ హీ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ పన్ను కింద అక్కడి ప్రభుత్వానికి 10.78 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.80 వేల కోట్లు) చెల్లించాలని నిర్ణయించింది. దీంతో లీ కున్‌ హీ వదిలివెళ్లిన ఆస్తుల విలువలో సగానికిపైగా వారసత్వ పన్ను రూపంలో ప్రభుత్వానికి చెందనుంది. ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తయితే.. ప్రపంచంలోనే అత్యధిక వారసత్వ పన్ను చెల్లించిన వారిగా శాంసంగ్‌ వారసులు నిలుస్తారు.

* దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి హర్యానాలో ఉన్న తన తయారీ యూనిట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌2లో తెలిపింది. అలాగే, గుజరాత్‌లో కూడా తన తయారీ విభాగాన్ని మూసివేయాలని సుజుకి మోటార్ నిర్ణయించినట్లు మారుతి సుజుకి తెలిపింది. మే 1 నుంచి మే 9 వరకు కంపెనీ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. “కార్ల తయారీలో భాగంగా, మారుతి సుజుకి తన కర్మాగారాల్లో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఆక్సిజన్‌ కోసం వాడుకోవాలని మేము నమ్ముతున్నాము” అని మారుతి సుజుకి ఒక ప్రకటనలో పేర్కొంది.

* కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్‌ ఎకానమీ వృద్ధి తొలి అంచనాలను తగ్గిస్తున్న ఆర్థిక విశ్లేషణ, రేటింగ్‌ సంస్థల వరుసలో తాజాగా బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ చేరింది. క్రితం 11 శాతం అంచనాలను 9 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. తొమ్మిది శాతం కూడా లోబేస్‌ వల్లే 2020-21లో అతి తక్కువ గణాకాల నమోదు) సాధ్యమవుతోందని తెలిపింది.

* దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించిన లోగో, బ్రాండ్‌ స్లోగన్‌ను ఆవిష్కరించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా పర్యావరణ అనుకూలమైన అధునాతన వాహనాల సంస్థగా కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని కంపెనీ పేర్కొంది. కొత్త లోగో సెల్టోస్, సోనెట్‌ వాహనాలను మే తొలి వారంలో ఆవిష్కరించనున్నట్లు కియా ఇండియా ఎండీ కూక్యున్‌ షిమ్‌ తెలిపారు.