కొమురవెల్లి లడ్డూల్లో మోసాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలు జరుగుతున్నట్టు తేలింది . మంగళవారం ఈవో వెంకటేశ్‌‌, పాలక మండలి చైర్మన్‌‌ సేవల్ల సంపత్‌‌ స్టాక్‌ రూమ్‌ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్‌‌ మాట్లాడుతూ… లడ్డూ తయారీలో అవకతవకలు జరగుతున్న విషయం తమ దృష్టికి రావడంతో నిఘా వేసినట్టు చెప్పారు . అందు లో భాగంగానే ప్రసాదాల తయారీతో పాటు రికార్డులను కూడా పరిశీలించి నట్టు తెలిపారు. ప్రసాదం తయారీలో ఉపయోగించే రూ. ఐదు లక్షల విలువైన నెయ్యి , ఖాజు, బాదామ్‌ , పిస్తా లను భయటకు తరలించినట్టు గుర్తించామని చెప్పారు. రికార్డుల పరిశీలనలో భారీ ఎత్తున తేడాలు రావడంతో పూర్తి స్థాయిలో విచారించడంతో అసలు విషయం భయటపడిందని అన్నారు . ఆలయ ఏఈవో సుదర్శన్‌‌తోపాటు ఉద్యోగులు మాధవి, పోచయ్యలకు మెమోలు జారీ చేసినట్టు చెప్పారు. మూడు రోజుల్లో ఈ విషయంపై ఆ ముగ్గురు సమాధానం ఇవ్వకుంటే దేవాదాయ ధర్మధాయ శాఖ కమిషనర్‌‌ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
1. 16 నుంచి బాలాత్రిపురసుందరి కల్యాణ బ్రహ్మోత్సవాలు
కూచిపూడిలోని నాట్యాచార్యుల ఇలవేల్పు బాలాత్రిపురసుందరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామివార్ల 256వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలను ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మశ్రీ శనగవరపు సత్యనారయణశర్మ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీసిద్ధేంద్రయోగి నాట్య మహోత్సవాలను ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల తొలిరోజైన శని, ఆదివారాల్లో స్వామివార్లను పెండ్లికుమారుడు, కుమార్తెలుగా అలంకరిస్తారు. 18న సాయంత్రం నరాలశెట్టి సాంబశివరావు భాగవతార్‌చే హరికథాగానం, సాయంత్రం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
2. వైభవంగా ప్రారంభమైన జాతర
కలిదిండి మండలం శివారు మూలలంకలో వేంచేసియున్న అమ్మలగన్నఅమ్మ శ్రీపెద్దింటి అమ్మవారి జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ చైర్మన్‌ కర్రి వెంకటసూర్య నారాయణ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం మేళతాళాలతో, విచిత్ర వేషధారణలతో కళాకారులు సందడి చేశారు. బాణాసంచా వెలుగులతో గ్రామంలో దీపావళి శోభ సంతరించుకుంది. స్త్రీ, పురుష బృందాలతో నిర్వహించిన కోలాటం, మురళీకోలాటం ఆద్యాంతం ఆకట్టుకున్నాయి. యువత తీన్‌మార్‌ నృత్యాలు, మహిళలతో బిందెలతో చేసిన నృత్యాలు, సినీ కోయడాన్సులు అలరించాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు.
3. చూచువారికి చూడముచ్చటగా..
సింగరాయపాలెం- చేవూరుపాలెం సెంటరులో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రమైన కృత్తిక నక్షత్రం సందర్భంగా కల్యాణం నిర్వహించారు. అందునా అరుదుగా వచ్చే కృత్తికా నక్షత్రం, షష్ఠి తిధి, మంగళవారం కావటంతో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారికి 310 మంది పంచామృత అభిషేకాలు నిర్వహించగా, 51 మంది కల్యాణం జరిపించుకున్నారు. అనంతరం నిర్వహించిన నిత్యాన్నదానంలో సుమారు 350 మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఇందులో ఆలయ సహాయ కమిషనర్‌ వీవీ.పల్లంరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
4. వటపత్ర శయనుడిగా నృసింహుడు-యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు
లక్ష్మీనరసింహ పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. మంగళవారం మధ్యాహ్నం అలంకార వేడుక, రాత్రి వాహన సేవ నిర్వహించారు. స్వామిని వటపత్ర శయనుడిగా అలంకరించి, తీర్థజనులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. కల్పవృక్షంపై స్వామిని, అమ్మవారిని ఉంచి బాలాలయ మండపంలో ఊరేగించారు. ఈ విశిష్ట పర్వాలతో పాటు హవనం, పారాయణం నిర్వర్తించారు. ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలను బుధవారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. గురువారం నుంచి విశేషోత్సవాలు మొదలవుతాయన్నారు.
5. 16 నుంచి రంగనాథుని బ్రహ్మోత్సవాలు
ఉత్తర శ్రీరంగంగా ఖ్యాతికెక్కిన నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి శ్రీరంగనాథస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు 16న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను దేవస్థానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈవో గోపి, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కోట గురుబ్రహ్మం, ప్రధానార్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు, ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. 27వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. ఉత్సవాల్లో భాగంగా 17న ధ్వజావరోహణ, రాత్రి శేషవాహన ఉత్సవం, 18న ఉదయం సూర్యప్రభ వాహన ఉత్సవం, రాత్రి హంస వాహన ఉత్సవం, 19న ఉదయం సింహవాహనం, రాత్రి చంద్రప్రభ వాహన ఉత్సవం జరుగుతాయి. 20న ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి హనుమంతసేవలను నిర్వహిస్తారు. 21న ఉదయం మోహినీ అవతారం, రాత్రి 10 గంటలకు బంగారు గరుడసేవ జరుగుతుంది. 22న రాత్రి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 23న ఉదయం రథోత్సవం, 24న రాత్రి అశ్వవాహనం, 25న రాత్రి పుణ్యకోటి విమాన వాహన ఉత్సవం జరుగుతుంది. 26న సాయంత్రం పుష్పయాగం, రాత్రి దవనోత్సవం అనంతరం జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకొని 27వ తేదీ రాత్రి పెన్నాతీరంలో స్వామివారికి విశేషంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
6. కన్నుల పండువగా మంగళ షష్ఠి పూజలు
మంగళ షష్ఠి పర్వదినం సందర్భంగా రాయగడలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి పూజలను కన్నుల పండువగా నిర్వహించారు. కస్తూరీనగర్‌ సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకాలు, విశేషపూజలు, సామూహిక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అత్యంత అరుదుగా ఫాల్గుణమాసంలో మంగళవారం, షష్టి, కృతిక నక్షత్రం కలిసి రావడం జరుగుతుందని, 27 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ షష్ఠ్టి రోజు విశేష పూజలు జరిపించడం ఆనవాయితీ అని ఆలయ ప్రధానార్చకులు పులఖండం రఘునాయక శర్మ, మావుడూరు కిషోర్‌శర్మలు తెలిపారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.జేకే పూర్‌ కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు 18 వరకూ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు ఉత్సవ విగ్రహ స్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు, భక్తులు హాజరు కావాలని ఆలయ ప్రధానార్చకులు పొందూరు వెంకటప్రదీప్‌, బి.జగన్నాథాచార్యులు కోరుతున్నారు.
7. 13.03.2019న తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి ఒక దినపత్రికలో ప్రచురించిన వార్తలో వాస్తవం లేదు. మఠాధిపతులకు, పీఠాధిపతులకు శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశ నియమాలలో ఎలాంటి మార్పు లేదు.ఆలయ మహాద్వార ప్రవేశానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులే కాకుండా ఇంకా ఎవరెవరు రావచ్చని తెలిపేదే సదరు ప్రభుత్వ ఉత్తర్వు.ఆలయ మర్యాదలు పొందే మఠాధిపతులకు, పీఠాధిపతులకు సంవత్సరానికి ఒకసారి వారితో పాటు ఐదుగురికి మహాద్వార ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా వారితో పాటు ఒక సహాయకునికి మహాద్వార ప్రవేశం ఉంటుంది.ఈ మేరకు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.
8. శుభమస్తు
తేది : 13, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 50 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 22 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 54 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 5 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 37 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 48 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 24 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 26 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 25 ని॥ లకు
సూర్యరాశి : కుంభము
చంద్రరాశి : వృషభము
9. చరిత్రలో ఈ రోజు/మార్చి 13
1733: ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.
1889: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.
1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
1963: అర్జున అవార్డును ప్రారంభించారు.
10. ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో మంగళవారం జెఈవో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ ఉదయం సాయంత్రం
03-04-19(బుధవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
04-04-19(గురువారం) చిన్నశేష వాహనం హంస వాహనం
05-04-19(శుక్రవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
06-04-19(శనివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
07-04-19(ఆదివారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
08-04-19(సోమవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
09-04-19(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
10-04-19(బుధవారం) రథోత్సవం అశ్వవాహనం
11-04-19(గురువారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం **ధ్వజావరోహణం
ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు :
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి, 15న శ్రీ సీతారామ కల్యాణం, 16న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
**ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రామచంద్ర పుష్కరిణిలో 17వ తేదీన మొదటిరోజు 5 చుట్లు, 18న రెండవ రోజు ఏడు చుట్లు, 19న చివరిరోజు తొమ్మిది చుట్లు తిరిగి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ ఈ.సీ.శ్రీధర్ , ఏఈవో శ్రీ తిరుమలయ్య , సూపరింటెండెంట్ శ్రీ అశోక్ కుమార్, శ్రీ జీ.రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com