వీసాలు ఇక ఇంటికి వచ్చి ఇస్తారు

***వీసా తీసుకోవాలంటే అదో పెద్ద ప్రహసనం. ఏ దేశానికి వెళుతున్నామో ఆయా దేశాలకు వీసాలు, పాస్‌ పోర్టులు ఇప్పించే కార్యాలయాల చుట్టూ తిరగాలి. వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత దేశానికి చెందిన కార్యాలయం లేదా ట్రాన్స్‌ పోర్టు, టూరిస్టు కార్యాలయాలకు వెళ్లాల్సివచ్చేది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇంకా కొన్ని డాక్యుమెంట్లు కావాలి, వాటిని తీసుకుని రండి.. అని చెబుతారు. ఇలా వీసా తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం సాంకేతిక ప్రగతితో సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రభుత్వ సర్వీసులు కూడా ఆన్‌లైన్‌ లోకి మారిపోయాయి. ఎవరిని కదిలించినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశావా.. అంటారు. ఇదే బాటలోకి ఇప్పుడు వీసాలు వచ్చి చేరాయి. ఆన్‌లైన్‌లో వీసా తీసుకునే విధానానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నట్లు వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వీసా సర్వీసుల సంస్థ చేసిన సర్వేలో తేలింది.
*ఎలా పనిచేస్తుంది…
సాధారణంగా.. వీసా అప్లికేషన్‌ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. డోర్‌ స్టెప్‌ వీసా సర్వీసులను ఎంపిక చేసుకుంటే మాత్రం.. వారే ఇంటి వద్దకు వచ్చి అవసరమైన డాక్యుమెంట్లు, బయోమెట్రిక్‌ తీసుకుని అక్కడే దరఖాస్తు చేయిస్తారు. ఏవైనా సమస్యలుంటే అక్కడే పరిష్కారమయ్యేలా చూస్తారు. ఒకేసారి వీసా దరఖాస్తు పూర్తయ్యేలా చూస్తారు.
*ఎవరు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు…
ఈ సర్వీసులను ఎక్కువగా పెద్దపెద్ద ట్రావెల్‌ ఏజెన్సీలు, కార్పొరేట్‌ కంపెనీలు, వినియోగించుకుంటున్నాయి. సినిమా నిర్మాణ సంస్థలు కచ్చితంగా విదేశాల్లో షూటింగ్‌ చేయాల్సిందే. వీరికి ఈ సర్వీసులు బాగా ఉపయోగపడుతున్నాయి. సినిమాలో భాగమైనవారందరికీ కార్యాలయాల్లోనే వీసాలు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు బయటికి వెళ్లి వీసా దరఖాస్తు చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయం. ఒకవేళ వారి తరఫున ఎవరైనా వెళ్లినా లేనిపోని చిక్కులు. ఇంటివద్దనే వీసాకు దరఖాస్తు చేసుకునే ఈ విధానం వారి సమస్యను తీర్చింది.
*144 శాతం పెరుగుదల
ఈ సంస్థ సర్వే ప్రకారం ఇంటి వద్దకే వీసాకు దేశంలో ఆదరణ పెరుగుతోంది. ఒక్క ఏడాదిలోనే అంటే 2018వ సంవత్సరంలో ఇంటి వద్దకే వీసా సేవలకు 144శాతం ఆదరణ పెరిగింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలైన తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి వీసాలకు ఆదరణ ఎక్కువగా పెరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా మన దేశంనుంచి పర్యాటకులు ఎక్కువగా విదేశాలకు వెళుతున్నారు. దీంతో చాలా మందికి వీసాలు అవసరమయ్యాయి. వీసాల కోసం సమయం వెచ్చించడం ఇష్టంలేనివారు ఇలాంటి సేవలవైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ నుంచి చదువులు, పర్యటనల కోసం ఇతర దేశాలకు వెళుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో తెలంగాణలో నానాటికీ వీసాలు తీసుకునేవారి సంఖ్య రెట్టింపవుతోంది. ఇందులో సింహభాగం హైదరాబాద్‌ నుంచే వెళుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com