తండ్రి సోదరుడు చేయలేకపోయారు. దినపత్రిక కోసం చేసేసింది.

శ్రీనివాస్‌ మంధాన.. జాతీయ జట్టుకు క్రికెట్‌ ఆడాలని కలలు కన్న ఓ తండ్రి. శ్రవణ్‌ మంధాన.. అదే క్రికెట్‌ను ఎంచుకొని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డ ఓ సోదరుడు. కానీ, ఆ తండ్రి కల నిజం కాలేదు.. ఆ సోదరుడి ఆశా నెరవేరలేదు.. అందుకే తండ్రి కలల్ని.. అన్నయ్య ఆశలను నెరవేర్చేందుకు నడుం కట్టిందో యువతి.. అహర్నిశలూ శ్రమించింది.. అనుకున్నది సాధించింది. ఇప్పుడామె.. భారత మహిళా క్రికెట్‌లో చెరిగిపోని అధ్యాయం.. అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకరు.. ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌ ఉమెన్‌.. మహిళల క్రికెట్‌ను చూసేందుకూ ప్రేక్షకులు మైదానానికి వస్తారని నిరూపించిన అందాల బొమ్మ.. ఈ పాటికే ఆమె ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆమే స్మృతి మంధాన.. తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వార్తపత్రికల్లో తన ఫొటో చూసుకోవాలని కలిగిన కోరిక ఆమెను ఆట వైపు అడుగులు వేయించింది.. మరి ఆ ఆట ఆమె జీవితాన్నే ఎలా మలుపు తిప్పింది..? ఆమె క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలేంటి..?

క్రికెటర్‌ కొడుకే క్రికెటర్‌ అవుతాడనేది పాత ట్రెండు.. క్రికెటర్‌ కూతురు కూడా క్రికెటర్‌ అవుతుందనేది కొత్త ట్రెండు. అందుకే స్వతహాగా క్రికెటర్‌ అయిన శ్రీనివాస్‌ కుమార్తె స్మృతి మంధాన కూడా క్రికెటర్‌ అయింది. 1996 జూలై 18న ముంబయిలో శ్రీనివాస్‌ మంధాన, స్మితా దంపతులకు రెండో సంతానం స్మృతి మంధాన. తండ్రి కెమికల్‌ డిస్ర్టిబ్యూటర్‌, తల్లి గృహిణి. స్మృతి రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం మొత్తం సంగ్లీలోని మాధవనగర్‌కు మకాం మార్చింది. అక్కడే స్మృతి మంధాన పాఠశాల విద్య పూర్తి చేసింది. తండ్రి శ్రీనివాస్‌ ఒకప్పటి జిల్లా స్థాయి క్రికెటర్‌. సంగ్లీ జట్టు తరఫున ఆడేవారు. అన్నయ్య శ్రవణ్‌ కూడా జిల్లా స్థాయి క్రికెటర్‌. అండర్‌-16 జట్టులో శ్రవణ్‌ క్రికెట్‌ ఆడుతుంటే స్మృతి ఆసక్తిగా గమనించేది. అన్నయ్య ఫొటోలు వార్త పత్రికల్లో వస్తే చూసి.. నా ఫొటో కూడా పేపర్లో వస్తే చూసుకోవాలని అనుకునేది. క్రికెట్‌పై స్మృతికి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి ఆమెను ప్రోత్సహించినా.. తన గారాల పట్టీకి ఎక్కడ గాయాలవుతాయోనని గాబరా పడేవారు. అలా స్మృతి క్రికెట్‌లో రాణించడంతో తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. మరోవైపు తల్లి స్మితా కూడా.. స్మృతికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసేది. ఇప్పటికీ స్మృతికి సంబంధించి తిండి, దుస్తుల ఎంపికలో తల్లి కీలక పాత్ర పోషిస్తుంది. తన అన్నయ్య క్రికెట్‌ ఆడుతుంటే తండ్రితో పాటు వెళ్లి చూసేది.. రోజూ అన్నయ్యతో పాటు నెట్స్‌కి వెళ్లేది. అన్నయ్యలాగే ఆడాలని అతడ్ని అనుకరించేది. సాధారణంగా కుడిచేతి వాటం అయిన మంధాన.. తనకు తెలియకుండానే ఎడమచేతితో చేయడం ప్రారంభించిది. అలా అన్నయ్యను చూస్తూ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది.. ప్రతి రోజు ఉదయం నెట్స్‌లో క్రికెట్‌ సాధన చేసి.. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లేది. మళ్లీ సాయంత్రం కాసేపు నెట్స్‌కు వెళ్లి సాధన చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్లేది. ఉపాధ్యాయులు ముందుగా పంపిస్తే సాధనకు ఎక్కువ సమయం కేటాయించేది.. సాధన పూర్తవగానే ఇంటికి వెళ్లి టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేది. 15ఏళ్ల వయసులో ఉన్న మంధాన శిక్షణ కోసం ముంబయి లేదా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలన్నా చదువుకు దూరం కావాల్సి వస్తోంది. ఓ వైపు చదువు.. మరో వైపు క్రికెట్‌.. ఏం చేయాలో తోచలేదు. దేన్ని వదులుకోవాలో అర్థం కాలేదు. ఇంతలోనే తనకో ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తాను పొదుపు చేసుకున్న డబ్బుతో సొంతంగా కాంక్రీట్‌ పిచ్‌ తయారు చేయించుకుంది. ఆ పిచ్‌పై రోజూ సాధన చేసేది. చదువు కొనసాగిస్తూనే క్రికెట్‌ సాధన చేసింది. తాను పడ్డ శ్రమకు ప్రతిఫలంగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే మహారాష్ట్ర అండర్‌-15జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పదిహేడేళ్ల వయసులో మంధానకు మహారాష్ట్ర అండర్‌-19జట్టు నుంచి పిలుపొచ్చింది. 2013లో ఆమె ఆడిన ఓ మ్యాచ్‌ మంధాన క్రికెట్‌ జీవితాన్నే మలుపు తిప్పింది. వడోదరలో మహారాష్ట్ర, గుజరాత్‌ అండర్‌-19 జట్ల మధ్య మ్యాచ్‌. అందులో మంధాన సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై చిచ్చరపిడుగులా విరుచుకుపడింది. కళ్లు మూసి తెరిచేలోపు డబుల్‌ సెంచరీ పూర్తి చేసింది. 150 బంతుల్లో 224 పరుగులు చేసి.. ద్విశతకం చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి ఆమెకు ఎన్నో అవార్డులు.. మరెన్నో అవకాశాలు రావడం మొదలయ్యాయి. 2013లో ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌లో అవకాశం రావడంతో పదహారేళ్లకే స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2014 ఆగస్టులో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌ ఆడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే ఊపుతో 2016లో ఆసీస్‌ గడ్డపై జరిగిన ఓ వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు చేసింది. ఆ ఏడాది మంధానకు మంచిపేరు తీసుకొచ్చింది. 2016 ఉమెన్స్‌ ఛాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా రెడ్‌ తరఫున మూడు అర్ధశతకాలు నమోదు చేసింది. ఇండియా బ్లూ జట్టుపై విజయం సాధించడంలో ముఖ్యభూమిక పోషించింది. ఆ టోర్నీలో 192 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ఉమెన్‌గా నిలిచింది. ఐసీసీ 2016 ఉమెన్స్‌ జట్టులో చోటు సంపాదించింది. మంధాన మినహా మరే భారత క్రీడాకారిణి ఆ జట్టులో చోటు సంపాదించకలేకపోవడం గమనార్హం. మంధాన 2017 మహిళా ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై 90 పరుగులు చేసింది. వెంటనే వెస్టిండీస్‌పై మరో మారు శతకం(106)తో విజృంభించింది. మార్చి 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 30 బంతుల్లో 50 పరుగులు చేసింది. అత్యంత వేగవంతమైన అర్ధశతకం చేసిన మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2018 మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 25బంతుల్లోనే అర్ధశతకం చేసింది. ఇంతకుమందు తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టింది. ‘2017లో మోకాలి గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. దాదాపు రెండు నెలల పాటు నడవడానికి కూడా కర్రసాయం. రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టేవి. ఇక కెరీర్‌ ముగిసినట్లే అని ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయాను. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకొని సానుకూల దృక్పథంతో ఆలోచించడం మొదలుపెట్టా. నేను కనీసం ఇండియన్‌ జెర్సీ వేసుకోగలుగుతున్నాను.. ఆ అవకాశం కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు.. కాబట్టి వాళ్లకంటే నేను ఎంతో అదృష్టవంతురాలిని అనుకునేదాన్ని’ అని తన మనసులోని మాట బయటపెట్టింది మంధాన. ఆ తర్వాత 2017 ప్రపంచ కప్‌లో పునరాగమనం చేసిన మంధాన బ్యాటుతో విజృంభించింది. శ్రీలంక మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ కుమార సంగక్కర అంటే చాలా ఇష్టం. మంధాన తన బ్యాటింగ్‌లో అసంతృప్తి కలిగినప్పుడు వెంటనే టీవీలో సంగక్కర బ్యాటింగ్‌ క్లిప్పులు చూస్తుందట. ఇటీవల జరిగిన భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఆడుతున్న మంధానకు అదే మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగక్కరను కలిసే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి ఫొటో కూడా దిగింది. ఆ ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సంగక్కరను టీవీల్లో చూడటం తప్ప నేరుగా చూడటం అదే మొదటి సారి.. అని తెగ సంబరపడిపోయింది. సినిమాల్లో బాలీవుడ్‌ స్టార్‌.. హృతిక్‌రోషన్‌ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు వదలకుండా చూస్తుందట. సమయం దొరికితే అరిజిత్‌సింగ్‌ పాటలు వింటుందట. వాలీబాల్‌ అంటే ఇష్టం.. క్రికెట్‌ మ్యాచ్‌ లేనప్పుడు వాలీబాల్‌ చూస్తుందట.

*** రికార్డులు
• ద్విశతకం బాదిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు.
• ఐసీసీ ప్రకటించిన 2016 జట్టులో భారత్‌ నుంచి చోటు సంపాదించిన ఏకైక బ్యాట్స్‌ఉమెన్‌.
• 2018లో అర్జున అవార్డుతో సత్కారం.
• 2018 ఐసీసీ క్రికెటర్‌, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తింపు.
• కియా సూపర్‌ లీగ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.
• 2019 ఫిబ్రవరిలో ప్రకటించిన ఐసీసీ బ్యాట్స్‌ఉమెన్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం.
• దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో సెంచరీలు చేసిన మొదటి భారత మహిళ క్రికెటర్‌.
• 2019 ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యంత ప్రతిభావంతులైన 30ఏళ్లలోపు వాళ్ల జాబితాలో స్మృతికి చోటు.
• టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో మిథాలీరాజ్‌ తర్వాతి స్థానం మంధానదే.
• 2016 బిగ్‌బాష్‌లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మొదటి క్రీడాకారుల్లో ఒకరు.
• జూన్‌ 2018లో కియా సూపర్‌ లీగ్‌లో ఆడిన మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com