మరో ప్రవాసాంధ్రుడికి ఝలక్ ఇచ్చిన చంద్రబాబు


గుంటూరు జిల్లాకు చెందిన అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున గత రెండు నెలలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మాజీ అధ్యక్షుడిగా, ఎన్‌టీఆర్ ట్రస్ట్ డైరక్టరుగా పలు పదవులు నిర్వహించిన ఈయన గుంటూరు పశ్చిమ నుండి తెదేపా అభ్యర్థిత్వం కోసం విశెషమైన సమయాన్ని కేటాయించి సుడిగాలి పర్యటనలు జరిపారు. ఇదే స్థానానికి స్థానికులు మద్దాల గిరి, శనక్కాయల ఉమాశంకర్‌లు కూడా మోహనకృష్ణతో పాటు ప్రచారం నిర్వహించుకున్నారు. గురువారం అర్ధరాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా వెలువరించారు. ఈ జాబితాలో మోహనకృష్ణకు స్థానం దక్కలేదు. గుంటూరు పశ్చిమ టికెట్‌ను మద్దాల గిరికి చంద్రబాబు ఖరారు చేశారు. గత ఏడాది న్యూయార్క్‌లో పర్యటించిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ఈ దఫా టికెట్ కేటాయింపుల్లో ప్రవాసులపై శీతకన్ను వేశారు. ఈ ఎన్నికల్లో తెదేపా టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ప్రవాసాంధ్రుల్లో మోహనకృష్ణ రెండోవారు. ఇటీవల కడప జిల్లా రాజంపేట తెదేపా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైకాపాలో జేరగా ఆ స్థానం కోసం తానా అధ్యక్షుడు వేమన సతీష్ ప్రయత్నించినప్పటికీ చంద్రబాబు దాన్ని స్థానికుడైన చెంగలరాయుడుకు కట్టబెట్టారు. పార్టీకి ఆర్థిక, అంతర్జాలిక బలంగానే తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో విజయాన్ని తీసుకువచ్చే పందెం గుర్రాలుగా ప్రవాసులను చంద్రబాబు ఇంకా గుర్తించకపోవడం ఎన్నారై తెదేపా శ్రేణుల్లో కూసింత నిరాశ కలిగించే అంశం. అత్యధిక ప్రవాస కార్యకర్తలు కలిగిన తెదేపా తరఫున భవిష్యత్తులో మరింత మంది ఎన్నారై ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే చొరవను పార్టీ అధిష్టానం చూపిస్తే విదేశీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో ఏపీని మరింత ముందరకు తీసుకెళ్లే అవకాశం కల్పించినవారు అవుతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com