రుచి, నాణ్యతలో నూజివీడు మామిడి పెట్టింది పేరు. అందుకే మామిడి ప్రియులు నూజివీడు మామిడి తినాల్సిందేనంటారు. ఇప్పుడు నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి పనికొచ్చేలా వీటి నాణ్యత ఉండటంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ఉధృత రూపం దాలుస్తుండడంతో మార్కెట్లో మామిడి ధర క్షీణించింది. నెలరోజుల కిందటివరకు టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలికిన బంగినపల్లి రకం ఇప్పుడు స్థానిక మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. ఫిబ్రవరి ఆఖరులో టన్ను తోతాపురి రకం రూ.80 వేల ధర ఉండగా ఇప్పుడు రూ.10 వేలలోపే పలుకుతోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేసేవారు నాణ్యమైన బంగినపల్లిని టన్ను రూ.50 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు.
**10 రోజుల కిందట అర టన్ను బంగినపల్లి మామిడిని టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేసి ఎగుమతిదార్లు సింగపూర్‌కు పంపారు. 5 రోజుల కిందట కృష్ణాజిల్లా పామర్రులోని ప్యాక్‌హౌస్ నుంచి 12 టన్నుల మామిడిని ఒమన్ దేశానికి ఎగుమతి చేశారు. అలాగే శనివారం మరో 15 టన్నుల బంగినపల్లి మామిడిని దుబాయ్‌కి పంపనున్నారు. తాజాగా నూజివీడు మండలం హనుమంతునిగూడెం నుంచి రాఘవులు అనే రైతు వద్ద 2 టన్నుల బంగినపల్లి మామిడిని టన్ను రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని తిరుపతిలోని ప్యాక్‌హౌస్‌లో ప్రాసెస్ చేసి దక్షిణ కొరియాకు ఎగుమతి చేయనున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేలా ఎగుమతిదారులను ఉద్యానశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఎగుమతిదార్లతో గతనెలలో విజయవాడలో మ్యాంగో బయ్యర్స్, సెల్లర్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా)తో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూజివీడు మామిడి రుచి, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర ప్రాంతాల ఎగుమతిదార్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు.
**100 టన్నుల ఎగుమతి దిశగా..
గత ఏడాది కృష్ణా జిల్లా నుంచి విదేశాలకు నూజివీడు మామిడి సుమారు 60 టన్నులు ఎగుమతి చేశారు. ఈ సీజనులో ఇప్పటివరకు 12.5 టన్నుల బంగినపల్లి మామిడి సింగపూర్, ఒమన్ దేశాలకు ఎగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో మరో 17 టన్నులు దుబాయ్, దక్షిణ కొరియాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నూజివీడు ఉద్యానశాఖ ఏడీ శ్రీనివాసులు చెప్పారు. ఈ ఏడాది దాదాపు 100 టన్నుల వరకు నూజివీడు మామిడిని ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
విదేశాలకు నూజివీడు మామిడి ఎగుమతి
Related tags :