Fashion

ఆఫీసులో ఈ పనులు చేయకండి

ఆఫీసులో ఈ పనులు చేయకండి

*** ఫోన్‌ మాట్లాడుతున్నారా…
వ్యక్తిగత ఫోన్‌కాల్‌ మాట్లాడేటప్పుడు పరిసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లోవాళ్లపై కోపంతో అరవడం లాంటివి ఆఫీసులో అస్సలు చేయొద్దు. మీ కాల్స్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ఇక్కడ క్రమశిక్షణగా నడుచుకోవడం ఉద్యోగులుగా మన విధి.

*** ఆలస్యంగా వస్తున్నారా..
విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఏ ఉద్యోగిపైనా యాజమాన్యానికి సదభిప్రాయం ఉండదు. ఇలా ఆలస్యంగా రావడం వల్ల మీ సహోద్యోగులు, అధికారి మిమ్మల్ని సమయపాలన తెలియని వ్యక్తిగా చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. కాబట్టి సమయానికి ఆఫీసుకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.

*** ఫిర్యాదుల పెట్టెలా మారొద్దు…
మీ సహోద్యోగులు, వాతావరణం, చేసే పని… ఇలా ఏ విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు దాని గురించి పై అధికారులకు తెలియజేయడం మంచిదే. అయితే ప్రతి చిన్న విషయానికి దాన్నో సమస్యలా మార్చి చీటికీమాటికీ అధికారులను ఇబ్బందికి గురిచేయొద్దు. మీరలా చేస్తే మిమ్మల్ని ‘కంప్లయింట్‌ బాక్స్‌’లా పరిగణిస్తారు.

*** సామాజిక మాధ్యమాల్లో… వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగత కాల్స్, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలను చూడటం… లాంటివన్నీ కేవలం భోజనం, విరామం సమయంలో మాత్రమే చేయాలి. అదే పనిగా ఫోన్‌ మాట్లాడుతూ అమూల్యమైన కార్యాలయ కాలాన్ని వృథా చేయొద్దు. అలాగే మీ వ్యకిగత అవసరాల కోసం కంపెనీ కంప్యూటర్లను వాడొద్దు.