రాష్ట్రమంతా తెదేపా గాలి వీస్తోంది:చంద్రబాబు–రాజకీయ-03/17

*ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన తెదేపా బూత్‌ కన్వీనర్ల సభలో సీఎం మాట్లాడారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో సభల అనంతరం ఆయన నేరుగా కాకినాడ చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా సీట్లు దక్కనివాళ్లే వైకాపాలోకి వెళ్తున్నారని.. సేవాభావం ఉన్నవాళ్లే తెదేపాలో కొనసాగుతున్నారని చంద్రబాబు చెప్పారు. తెదేపా కార్యకర్తలు చాలా కసిగా, పట్టుదలగా ఉన్నారన్నారు. రాష్ట్రమంతా తెదేపా గాలి వీస్తోందని.. అడ్డం వస్తే కొట్టుకుపోతారని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా తప్ప మరో పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని.. వారికి అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. అలెగ్జాండర్‌కు 10 లక్షల సైన్యం ఉంటే.. తనకు 65 లక్షల సైన్యం ఉందన్నారు.
*ఏపీ భాజపా తొలి జాబితా విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 123 మందితో జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకే మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.
*జేడీ లక్ష్మీనారాయణ పోటీ ఇక్కడి నుంచేనా..?
సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని విచారించి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన తొలిసారి ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అడుగులు ఏ పార్టీవైపు పడతాయనేది ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. చివరకు పవన్ కల్యాణ్‌ ఆహ్వానం మేరకు జనసేనలో చేరి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.
*ఆడ్వాణీ స్థానంలో అమిత్‌ షా పోటీ!
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గాంధీనగర్‌ లో్క్‌సభ స్థానం నుంచి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పోటీచేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కిశోర్‌ చౌహాన్‌ ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకూ ఆ స్థానం నుంచి పార్టీ కురువృద్ధుడు ఎల్.కె.ఆడ్వాణీ ప్రాతినిధ్యం వహించేవారు. 1991 నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు ఆడ్వాణీ అక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వృద్ధాప్యం దృష్ట్యా ఈసారి ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటున్న తరుణంలో ఆ స్థానంలో మరో అభ్యర్థి కోసం స్థానిక కార్యకర్తల అభిప్రాయాల్ని సేకరించేందుకు భాజపా పరిశీలకులను పంపించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతూ.. అమిత్‌ షా గతంలో ఇదే లోక్‌సభ నియోజకవర్గంలోని సర్‌ఖేజ్‌ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. గాంధీనగర్‌ నియోజకవర్గంలో పరిస్థితి అమిత్ షాకు బాగా తెలుసు కాబట్టి ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే సహా పార్టీ కార్యకర్తలంతా అన్నారు. పార్టీ పరిశీలకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
*ప్రచారం చేసుకోండి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదుగురు ఎంపీలకు టికెట్లు ఖరారు చేశారు. కరీంనగర్‌ ఎంపీగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, నిజామాబాద్‌ ఎంపీగా కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్‌, భువనగిరి, మెదక్‌ ఎంపీలు నగేశ్‌, బూర నర్సయ్యగౌడ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు ఆయన ఫోన్‌ చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని సీఎం పునఃపరిశీలిస్తున్నట్లు తెలిసింది. శనివారం ఎంపీలతో భేటీ అయి జాబితాను ప్రకటించాలని భావించినా, కొత్త పరిణామాలు తెరమీదికి రావడంతో అభ్యర్థుల విషయంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల నుంచి మద్దతుతో పాటు ఇతర అనుకూలతలు ఉన్నందున అయిదుగురు ఎంపీలకు అనుకూల సంకేతాలిచ్చారు.
*కేంద్రం మన చేతుల్లో ఉంటే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న పథకాలనే పేరు మార్చి కేంద్రంలో నరేంద్రమోదీ, ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఒక్కరే దేశంలో రైతుల గురించి ఆలోచిస్తున్నారన్నారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కేసీఆర్‌ అని… 16 ఎంపీ స్థానాలతో దిల్లీని శాసించలేమా అని ప్రశ్నించారు. నల్గొండ కంచుకోటగా భావించే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ భంగపడిందని…అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో కార్యకర్తలందరూ పనిచేసి ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నల్గొండలో శనివారం పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
*వైకాపా అధికారంలోకొస్తే రావణకాష్ఠమే
‘‘వైకాపా అధికారంలోకి వస్తే ఏపీని రావణకాష్ఠం చేస్తారు. ప్రతిపక్షంలో ఉంటేనే అరాచకాలు సృష్టించి తప్పించుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. ఇక వీరు అధికారంలోకి వస్తే.. ఎక్కడైనా హత్య జరిగితే అతీగతీ ఉండదు. ఇటువంటి దౌర్జన్యాలకు మీరు సహకరిస్తారా’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. శనివారం తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సమరభేరి మోగించి, శంఖారావాన్ని పూరించారు. తొలుత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అనంతరం తిరుపతి చేరుకున్నారు. తెదేపా కార్యకర్తలు, సేవామిత్ర సభ్యులతో ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను దాచిపెట్టారు. గుండెపోటుతో మరణించారని చిత్రీకరించారు. పడకగదిలో ఉన్న రక్తాన్ని తుడిచేశారు.
*దేశంలో భాజపా వ్యతిరేక పవనాలు
ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయతను కోల్పోయారని, ప్రస్తుతం దేశంలో భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ప్రధాని స్వయంగా ప్రచారం చేసినా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓడిపోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో భాజపా అనుకూల వాతావరణం లేదని అన్నారు. తాను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల రుణాలు మాఫీ చేశామని, తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించామని తెలిపారు.
*ఏపీలో 15 మందితో తెదేపా రెండో జాబితా
తెదేపా రెండో విడత అభ్యర్థుల జాబితాను శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విడుదల చేసింది. మొత్తం 15 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 34 నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టింది. చిత్తూరు నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సత్యప్రభ స్థానంలో ఏఎస్‌ మనోహర్‌కు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో సత్యప్రభ రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చాలని జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో 4 స్థానాలను పెండింగ్‌లో పెట్టి, దాని పరిధిలోని 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు.
*తెరాస ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి
ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను అదేపనిగా తమ పార్టీలో చేర్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా మాట్లాడితే.. అది తమ పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు.
*కాంగ్రెస్‌లో లోక్‌సభ టికెట్ల చిచ్చు
ఓవైపు శాసనసభ్యులు పార్టీని వీడుతుండటం… మరోవైపు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో కొన్ని స్థానాల్లో అసమ్మతి రాజుకోవడం కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టికెట్‌ దక్కని నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం ఆశించి దక్కని నరేష్‌ జాదవ్‌ కాంగ్రెస్‌ను వీడారు. ఈ టికెట్‌ను మాజీ ఎంపీ రమేష్‌రాఠోడ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్లు నరేష్‌ జాదవ్‌ ప్రకటించారు. ఇదే స్థానం నుంచి లోక్‌సభ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం.
*తిరువనంతపురం నుంచే శశిథరూర్‌ పోటీ
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ 27మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను శనివారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పేర్లేవీ లేవు. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌.. కేరళలోని తిరువనంతపురం నుంచే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కేవీ థామస్‌ (72)కు టికెట్‌ దక్కలేదు. ఎర్నాకుళం లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన థామస్‌.. ఈసారి అక్కడి నుంచే టికెట్‌ను ఆశించారు. కాగా పార్టీ నిర్ణయం తనకు షాక్‌కు గురిచేసిందని థామస్‌ పేర్కొన్నారు. ఎర్నాకుళం నుంచి 35 ఏళ్ల హిబి ఈడెన్‌కు అవకాశం ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం నబమ్‌ తుకీకి అరుణాచల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
*మొన్న వైకాపా.. నిన్న తెదేపా.. నేడు భాజపా
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు భాజపాలో చేరారు. శనివారం భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఛైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మరికొందరు కూడా పార్టీలో చేరారు. జయరాములు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలతో దేశానికి ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతో భాజపాలో చేరానని, అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. 2014లో జయరాములు వైకాపా తరఫున బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. ప్రస్తుతం అక్కడ తెదేపా సీటు ఓబులాపురం రాజశేఖర్‌కి కేటాయించారు. దీంతో జయరాములు పార్టీ మారారు.
*లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా లోక్‌సత్తా
ఏప్రిల్‌ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని లోక్‌సత్తా పార్టీ నిర్ణయించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ హైదరాబాద్‌ కార్యాలయం నుంచి శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో తెలంగాణలో జరిగే పురపాలక, ఏపీలో పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
*ఎన్నికల తర్వాతే అచ్ఛే దిన్‌- ఒవైసీ
దేశానికి మంచిరోజు (అచ్ఛే దిన్‌) ఎన్నికల అనంతరం వస్తుందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా మైనార్టీలు, దళితులు, బీసీలు.. అందరూ ముందుకొస్తున్నారంటూ శనివారం ట్వీట్‌ చేశారు. తన హయాంలోనే దేశం అన్ని రంగాల్లోనూ నష్టపోయిందన్న వాస్తవాన్ని ప్రధాని ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. వాణిజ్యం పేరుతో జాతిసంపదను ఇతరులకు ధారాదత్తం చేయాలని చూస్తే, ప్రజలెవరూ ఊరుకోరన్నారు.
*బిహార్‌లో 11 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ
లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌ నుంచి 11 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉండగా, మహాకూటమితో జట్టు కట్టడంతో కాంగ్రె్‌సకు 11 సీట్లు దక్కాయి. ఈ సీట్లకు సంబంధించి అభ్యర్థుల పేర్లను రాహుల్‌కు పంపామని, ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేత అఖిలేశ్‌ సింగ్‌ తెలిపారు.
*బిహార్‌లో 11 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ
లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌ నుంచి 11 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉండగా, మహాకూటమితో జట్టు కట్టడంతో కాంగ్రె్‌సకు 11 సీట్లు దక్కాయి. ఈ సీట్లకు సంబంధించి అభ్యర్థుల పేర్లను రాహుల్‌కు పంపామని, ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేత అఖిలేశ్‌ సింగ్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com