WorldWonders

హైదరాబాద్ జూలోని సింహాలకు కోవిద్-తాజావార్తలు

హైదరాబాద్ జూలోని సింహాలకు కోవిద్-తాజావార్తలు

* హైదరాబాద్‌ నగరంలోని జూ పార్కులో వైరస్‌ కలకలం రేపుతోంది. ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగించింది. సింహాలకు కరోనా లక్షణాలు కన్పించడంతో వాటి నమూనాలు సేకరించిన అధికారులు వాటిని సీసీఎంబీకి పంపించారు. వాటిని పరిశీలించిన వైద్య నిపుణులు మృగరాజులకు సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ సోకినట్టు వెల్లడించారు. ఇది కొవిడ్‌ కాదని, సార్స్‌ కొవ్‌-2గా దీన్ని వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు జూ పార్కులను ఇప్పటికే అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే.

* ఒకవైపు రోజురోజుకీ ఎక్కువవుతున్న కొవిడ్‌-19 కేసులు. మరోవైపు పెరిగిపోతున్న మరణాలు. ఆసుపత్రుల్లో రద్దీ పెరగటం.. సదుపాయాలు, చికిత్సలు సత్వరం అందకపోవటం వంటి దృశ్యాలు భయానక పరిస్థితికే అద్దం పడుతున్నాయి. ఇంతటి భీతావహ వాతావరణంలోనూ టీకా ఒక్కటే ఆశాజనకంగా, తిరుగులేని బ్రహ్మాస్త్రంలా అభయమిస్తోంది. నిజానికి టీకా సైతం కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 లాంటిదే. కాకపోతే ప్రమాదకరం కాదు. ఎలాంటి హాని చేయకుండానే మనలో రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేసి మున్ముందు ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా.. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అయితే ఆరోగ్యవంతుల దగ్గర్నుంచి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, అలర్జీల వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారి వరకూ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. టీకా తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మనదగ్గర దాదాపు 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అయినా ఇంకా సందేహాలు ఎందుకు? ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని, ముందుకు సాగటమే తక్షణం చేయాల్సిన పని.

* ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్‌ తనతో వ్యాఖ్యానించారని ఈటల అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్‌లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* తెరాసలో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పార్టీలో తొలి నుంచీ ఆయనకు ప్రాధాన్యమివ్వడాన్ని తాము కళ్లారా చూశామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు.

* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూముల్లో ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జమున హేచరీస్‌ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ చాలా ఆసుపత్రులను ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. పలుచోట్ల ఆక్సిజన్‌ను నల్లబజారులో విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్‌ సరఫరా చేసే అన్ని రకాల వాహనాలను జీపీఎస్‌తో ట్రాకింగ్‌ చేయాలని నిర్ణయించింది. అన్ని వాహనాలకు వీఎల్‌టీ పరికరాన్ని అమర్చేలా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.

* దేశంలో 5జీ ట్రయల్స్‌కు టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు అనుమతి లభించడం విశేషం.

* ఏపీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మద్యం అమ్మకాల వేళలను కుదించారు. దీంతో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 20వేలకు పైగా కొవిడ్‌ కొత్త కేసులు రాగా.. 82మందికి పైగా మరణించారు.

* దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన చర్యలేవీ కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇక మహమ్మారి కట్టడి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు.

* ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. వరంగల్‌లో 48 డివిజన్లను తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 48 స్థానాల్లో తెరాస గెలుపొందింది. 10 డివిజన్లలో భాజపా కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 4, ఇతరులు 4 డివిజన్లలో విజయం సాధించారు. ఖమ్మం కార్పొరేషన్‌ పీఠాన్ని అధికార పార్టీ తెరాస చేజిక్కించుకుంది. 46 డివిజన్లలో తెరాస-సీపీఐ కూటమి విజయం సాధించింది. తెరాస అభ్యర్థులు 43, సీపీఐ అభ్యర్థులు 3 డివిజన్లలో గెలుపొందారు. 11 స్థానాల్లో కాంగ్రెస్‌ – సీపీఎం కూటమి సాధించింది. కాంగ్రెస్‌ 9 స్థానాలు, సీపీఎం 2 స్థానాలు, భాజపా 1, స్వతంత్రులు 2 డివిజన్లలో విజయం సాధించారు. మినీ పురపోరులో తెరాస తన సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 5 మున్సిపాలిటీలు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది.