Sports

ప్రయాణాలు కారణం కావచ్చు

ప్రయాణాలు కారణం కావచ్చు

ఐపీఎల్‌ బుడగ బలహీనంగా మారేందుకు బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అంచనా వేస్తున్నారు. వాస్తవ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ ఐపీఎల్‌ను ఎందుకు నిర్వహించాలనుకున్నారో వివరించారు.

‘బయో బుడగ లోపల ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో నాకైతే నిజంగా తెలియదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బహుశా ప్రయాణాలు ఒక కారణం కావొచ్చు’ అని దాదా అన్నారు. ‘ఐపీఎల్‌ నిర్వహణపై మేం నిర్ణయం తీసుకున్నప్పుడు కొవిడ్‌ విజృంభణ ఇలా లేదు. ఇప్పుడు చెప్పడం చాలా సులభం. ఈ టోర్నీ ఆరంభమైనప్పుడు ఉన్న కొవిడ్‌ కేసుల సంఖ్య అత్యంత స్వల్పం. మేం ముంబయిలో ఆరంభించి ఎలాంటి కేసులు లేకుండా ముగించాం. అప్పుడు నగరంలో ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు’ అని గంగూలీ తెలిపారు.

ఇంగ్లాండ్‌ సిరీస్‌ను విజయవంతం చేసినప్పుడు ఫిబ్రవరిలో కొవిడ్‌ కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉందని దాదా అన్నారు. విదేశీ ఆటగాళ్లు వారి స్వదేశానికి చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మొదట మాల్దీవులకు చేరుకొని అక్కడ క్వారంటైన్‌ పూర్తయ్యాక సురక్షితంగా ఇళ్లకు వెళ్తారని ఆశించారు. దుబాయ్‌లో బుడగను చూసుకున్న రీస్ట్రాటాకు భారత్‌లో అనుభవం లేదని అందుకే మరో సంస్థకు బాధ్యతలు అప్పజెప్పామని వెల్లడించారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దుబాయ్‌లో నిర్వహించడంపై కథనాలు వస్తున్నప్పటికీ ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని దాదా అన్నారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా సమయం ఉంది. నెల రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడే వ్యాఖ్యానించడం కష్టం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ యథా ప్రకారమే జరుగుతుందని, భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.