*** నాట్స్ 2019 రేండో రోజు సభలో యార్లగడ్డ
మూగ ప్రజలు, బధిర ప్రభుత్వాలు, “చైనా”(చైతన్య-నారాయణ) విద్య అనబడే మిథ్యా సహిత బోధనా విధానాల వలన తెలుగు భాష అపారమైన నిర్లక్ష్యానికి, అనంతమైన నిరాదరణకు గురవుతోందని రాజ్యసభ మాజీ సభ్యులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 6వ అమెరికా తెలుగు సంబరాల పేరిట అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ఇర్వింగ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహిత్యవేదిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అమరావతి శిలాఫలకంలో ఆంగ్లంలోనే, బెజవాడ రక్షకభట ప్రధాన కార్యాలయ సంకేత చిహ్నం ఆంగ్లంలోనే, తిరుమల దర్శనాల్లో ఆంగ్లం, మహనీయులను స్మరించుకుని వారి అడుగుజాడల్లో నడవాలని వారి ఆదర్శాలకు స్ఫూర్తిగా పనిచేసేందుకు ఉద్దేశించిన ప్రాంతాల పేర్లు కూడా ఆంగ్ల విషపరిష్వంగంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయని యార్లగడ్డ వాపోయారు. మమ్మీ డాడీ రెండు పదాలు ప్రత్యేకంగా కేవలం అమ్మా నాన్నకు ఉద్దేశించబడినందువలన వాటితో ప్రమాదం లేదని, కానీ అంకుల్-ఆంటీ అనే రెండు పదాలతో మొత్తం సనాతన భారతీయ కుటుంబ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. మావయ్య, బాబాయి, పెదనాన్న అన్నింటికీ అంకుల్, అత్త, పిన్ని, పెద్దమ్మ అన్నింటికీ ఆంటీ అంటూ ఒకే మాటతో తెలుగు నుడికారానికి ఉరి పెనవేశారని యార్లగడ్డ పేర్కొన్నారు. అటు ప్రభుత్వాలు తమ ఆంగ్ల పిచ్చిలో, ఇటు ప్రజలు తమ నాగరిక పైత్యంలో తెలుగును తొక్కేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోహం మంచిదే గానీ వ్యామోహం చెడ్డదని, ఆంగ్ల మోహం ఉండి తీరాల్సిందే గాని తెలుగును తన్నేసేటంత వ్యామోహం పనికిరాదన్నారు. వ్యభిచార గుంటగా వర్థిల్లిన విజయనగర సామ్రాజ్యం నేడు కేవలం చరిత్రలో ఓ గొప్ప సంస్థానంగా, శ్రీకృష్ణదేవరాయులు ఓ మహాకళా సేవకుడిగా వెలుగొందడానికి కారణం అష్టదిగ్గజాలనే సాహితీ కలమే తప్ప శ్రీకృష్ణదేవరాయులి ఖడ్గం కాదని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చిరకాలం గుర్తుండేది భాష సంస్కృతుల సేవలోనేనని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, గ్రామాలతో పాటు తెలుగు పండితులను కూడా దత్తత తీసుకోవాలని తద్వారా తెలుగు భాష భావితరాలకు అందించిన ఘనత మనకు దక్కుతుందని యార్లగడ్డ కోరారు. అనంతరం లక్ష్మీప్రసాద్‌ను సాహిత్యవేదిక సమన్వయకర్త మల్లవరపు అనంత్, నాట్స్ వైస్ చైర్మన్ అప్పసాని శ్రీధర్, డైరక్టర్ల బోర్డు సభ్యుడు దేశు గంగాధర్, శ్యాం మద్దాలి తదితరులు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన మీగడ రామలింగస్వామి సంగీత నవ అవధానం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సినీదర్శకుడు వై.వీ.ఎస్.చౌదరి, రచయితలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
ప్రవాసులు తెలుగు పండితులను దత్తత తీసుకోవాలి
Related tags :