Editorials

ప్రజలు రోదిస్తుంటే…ఢిల్లీలో ₹20వేల కోట్లతో భవన నిర్మాణం

కరోనా కారణంగా ప్రతీరోజు వేలమంది ప్రాణాలు కోల్పోతుంటే… ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్‌ కోసం జనం హాహాకారలు చేస్తున్నారు. మరోవైపు వేల కోట్ల రూపాయలతో ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించేందుకు ఇది ఆస్కారం కల్పిస్తోంది. వైద్య వ్యవస్థలో మౌలిక వసతుల కొరత కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని విదేశాలు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్న సమయంలో, దేశ రాజధానిలో వేలకోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశం తీవ్ర అవస్థలు పడుతోంది. ఎటుచూసినా భయాందోళనలే తాండవిస్తున్నాయి. ప్రతీరోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఒక్కసారిగా సంక్రమణ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో చికిత్సకు కావాల్సిన మందులు, పడకలు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తుతోంది. మరోవైపు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ దేశ రాజధాని ఢిల్లీలో రూ.20 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్‌ రోజురోజుకి తీవ్రమవుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. దేశంలో కరోనా పరిస్థితులను చక్కదిద్దేందుకు విదేశాల నుంచి సహాయాన్ని అంగీకరిస్తున్న కేంద్రప్రభుత్వం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్య వ్యవస్థపై ఇప్పటికైనా దృష్టిసారించి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని డిమాండ్‌ మొదలైంది.