టీకా వేసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన మహిళకు ఓ నర్సు అజాగ్రత్తతో ఆరు డోసుల వ్యాక్సిన్‌ను ఒకేసారి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటలీలోని టస్కాన్సీ నగరంలో ఉన్న నోవా ఆసుపత్రికి 23 ఏళ్ల మహిళ టీకా తీసుకునేందుకు వెళ్లింది. అయితే పరధ్యానంలో ఉన్న నర్సు ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకా బాటిల్‌లోని ఆరు డోసులను ఒకే సిరంజీలో నింపి ఆ మహిళకు ఒకేసారి వేసింది. అనంతరం తాను చేసిన పొరపాటును గుర్తించి విషయాన్ని వైద్యులకు వెల్లడించింది. అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం సదరు మహిళను 24 గంటలపాటు వైద్యుల సమక్షంలో పర్యవేక్షించింది. అయితే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు రాలేదని.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నోవా ఆసుపత్రి ప్రతినిధి వివరించారు. ఆమెను డిశ్ఛార్జి చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది కేవలం మానవ తప్పిదమేనని, ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు.
ఒకేసారి ఆరుడోసుల ఫైజర్ టీకా వేసిన నర్సు
Related tags :