Health

ఆవుపేడతో కరోనా ఆగదు-తాజావార్తలు

News Roundup - Cow Dung Will Not Stop COVID

* ఆవు పేడను శరీరానికి పూసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది సరికాదని, దీనివల్ల కరోనా నుంచి రక్షణ లభించదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. పేడను ఒంటికి పట్టించడం మూలంగా బ్లాక్‌ ఫంగస్‌ సహా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 200 ఆవులున్న స్వామినారాయణ్‌ గోశాలకు వారాంతాల్లో కొద్దిమంది వస్తూ… రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే భావనతో ఆవుపేడను ఒళ్లంతా పట్టించి… ఆపై గో మూత్రాన్ని రాసుకుంటున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆవు పేడ, పాలతో శరీరాన్ని కడిగేసుకుంటున్న వీడియోలు, ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విధంగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, కరోనా నుంచి రక్షణ లభిస్తుందని చెప్పడం సరికాదని వైద్యులు తప్పు పడుతున్నారు. అలా తగ్గుతుందని ఏ పరిశోధనల్లోనూ తేలలేదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, గాంధీనగర్‌ డైరెక్టర్‌ దిలీప్‌ మౌలాంకర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు అశాస్త్రీయ పద్ధతులు నేర్పి వారిని ప్రమాదంలోకి నెట్టి వేయొద్దని హితవు పలికారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 21,452 మంది కరోనా బారిన పడ్డారు. 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. అందులో 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మృతులతో కలిపి మరణాల సంఖ్య 8,988కి పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,927 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా.. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా పదకొండు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

* కోవిడ్19 యొక్క వ్యాప్తిని నిలువరించుటకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించినందున, ఏదైనా అత్యవసర అంతర్-జిల్లా లేదా అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు ముందస్తు అనుమతి/e-పాస్ తప్పనిసరి.ఈ e-పాస్ ను https://policeportal.tspolice.gov.in నుండి సంబంధిత పత్రాలను సమర్పించి పొందగలరు.

* కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భూమితో పాటు, అవసరమైనవన్నీ సమకూరుస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బుధవారం ఆమె ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు వేగంగా దిగుమతి అయ్యేలా చూడాలని విన్నవించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి దేశీయ, విదేశీ సంస్థలను ప్రోత్సహించాలన్నారు.

* తెలంగాణ కొత్తగా 4,723 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం మొత్తం కేసులు 5,11,711కు చేరాయి. తాజాగా కరోనాతో బాధపడుతూ మరో 31 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,834కు చేరింది. ఇప్పటివరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 క్రియాశీల (యాక్టివ్‌) కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి.

* తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు సీఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

* విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, ఆమేరకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచాలని, దేశంలో టాప్‌ టెన్‌లో రాష్ట్రంలోని యూనివర్సిటీలు నిలవాలని పేర్కొన్నారు. అదే విధంగా.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో యూనివర్శిటీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంపై అధికారులతో చర్చించారు.

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రధానికి రాసిన లేఖపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌ కోవాగ్జిన్ పేటెంట్ ఫార్ములాని అందరికి ఇవ్వాలన్నారు. దాని వల్ల వాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావచ్చు.. ఈ ముప్పు నుంచి కాపాడవచ్చిన సీఎం జగన్‌, మోదీకి లేఖ రాశారు. కానీ చంద్రబాబు మాత్రం భారత్‌ బయోటెక్‌ ఏ విధంగా పెటేంట్‌ వదులుకుంటుందని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీకి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ మీ బంధువుది అయినంత మాత్రాన ఇవ్వకూడదా’’ అని జోగి రమేష్‌ ప్రశ్నించారు.

* ఈ కరోనా కష్టకాలంలో అన్న‌దాత‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖ‌రీప్ పంట‌కాలానికి చెందిన వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ ఈ ఆర్దిక సంవత్సరానికి చెందిన తొలి విడత సాయాన్ని రేపు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం’ కింద అందించే ఈ ఏడాది మొదటి విడత సొమ్ము రూ.7,500లను రైతుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ లాంఛనంగా విడుదల చేయ‌నున్నారు. తొలి విడతగా రూ.3,882.23 కోట్లను 52.38 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్ర‌భుత్వం. కోవిడ్ కష్టకాలంలోనూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండాల‌ని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు.