Business

అమెరికా మీద పగసాధింపు యత్నాలు

Huawei folding cuffs to avenge USA ban

టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా రగిలిపోతోంది. దీంతో అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది. దీని ప్రకారం చైనాకు చెందిన సైబర్‌ స్పేస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొన్ని నిబంధనలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కీలకమైన విదేశీ పరికరాలు, సేవలను పొందితే వచ్చే ముప్పును పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు వెల్లడించింది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జూన్‌ 24లోపు ఈ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టనున్నారు. లీకింగ్‌, పోగొట్టుకోవడం, కీలక సమాచారం సరిహద్దులు దాటడం వంటి ముప్పులకు సంబంధించి ఈ నిబంధనలు ఉండవచ్చు. చైనా మార్కెట్లో ఉన్న అమెరికా సాంకేతికతను అడ్డుకొనేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి. గత వారం చైనాకు చెందిన హువావే, దానికి చెందిన 68 అనుబంధ సంస్థలు అమెరికాకు చెందిన సంస్థల నుంచి ఎటువంటి సాంకేతికత కొనుగోలు చేయకుండా ఆంక్షలను విధించింది. దీనికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని అమెరికా పేర్కొంది. దీంతో హువావేతో అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, బ్రాడ్‌కామ్‌ సంస్థలు తెగదెంపులు చేసుకొన్నాయి. అయితే, హువావేపై నిషేధాన్ని అమెరికా 90 రోజులు సడలించింది. దీంతో హువావే ఫోన్లకు గూగుల్‌ యాప్‌ సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇది వాణిజ్య యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.