Devotional

అక్షయ తృతీయ అంటే ఏమిటి?

అక్షయ తృతీయ అంటే ఏమిటి?

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్రను వినివుంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎన్నిమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనది భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో అంత విశిష్టత ఏర్పడింది. మహాభారత రచనను విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వేదవ్యాసుడు ఈ దినానే ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సంపదలకు అధిపతి కుబేరుడు శివున్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతుంది. మహాభారతంలో ధర్మరాజుకు అక్షయపాత్ర ఇవ్వడం, గంగానదీ ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువవుంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే వుంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. సంపద వుంటే మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుండగలం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద వుంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తాం. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని ప్రత్యేకతలు వున్నందునే అక్షయతృతీయను ఘనంగా జరుపుకొంటాం.