WorldWonders

17వ పెళ్లికి సిద్ధమయిన 66ఏళ్ళ ప్రబుద్ధుడు

17వ పెళ్లికి సిద్ధమయిన 66ఏళ్ళ ప్రబుద్ధుడు

తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగాలు, అత్తేసరు జీతాలు.. ఆకాశన్నంటే ధరలున్న ఈ కాలంలో ఒక్కరు బతకడమే కష్టంగా ఉంది. తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నా.. భార్యాభర్తలిద్దరూ జాబ్‌ చేస్తే తప్ప గడవదు. ఖర్చులకు భయపడే చాలా మంది ఒక్కరినే కంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇందుకు విరుద్ధం. ఇతగాడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 16 పెళ్లిల్లు చేసుకుని.. 151 మంది బిడ్డలను కన్నాడు. అంతటితో ఆగాడా అంటే లేదు.. తాజాగా 17వ సారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలో 17వ పెళ్లి జరగాలంటున్నాడు. ఇంతకు ఎవరా మహానుభావుడు.. ఏమా వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ అనుభవజ్ఞుడైన మిషెక్ న్యాన్డోరో బహుభార్యత్వ విధానంతో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఇక తన పూర్తి సమయాన్ని భార్యలను సంతృప్తిపర్చడానికే కేటాయిస్తాడట. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘32 ఏళ్ల క్రితం అనగా 1983లో నేను ఈ బహుభార్యత్వ ప్రాజెక్ట్‌ ప్రారంభించాను. నా లక్ష్యం చనిపోయే లోపు 100 పెళ్లిల్లు చేసుకుని.. 1000 మంది సంతానాన్ని కనాలి. నేను చనిపోయాకే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోతుంది. వివాహానికి ముందే దీని గురించి పెళ్లి చేసుకోబోయే వారికి చెప్తాను. వారి అంగీకారంతోనే ఇంతమందిని వివాహం చేసుకున్నాను. రోజంతా నా భార్యలని సంతృప్తిపరచడానికే కేటాయిస్తాను’’ అని తెలిపాడు.