Politics

భారతిని సీఎం చేయండి-తాజావార్తలు

BJP Vishnukumar Raju Demands YS Bharathi As CM

* వైకాపా పాలనలో అన్నీ అస్తవ్యవస్తంగా ఉన్నాయని ఏపీ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ చేతకానితనంతో ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణుకుమార్‌ రాజు మాట్లాడారు. సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగిస్తే అప్పుడైనా రాష్ట్రంలో కొంత మార్పు వస్తుందేమో చూద్దామని వ్యాఖ్యానించారు. కనీసం ఇప్పటికైనా ప్రజల ఆర్తనాదాలను జగన్‌ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

* కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా కొత్త రకాలపై పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో వెలుగుచూసినట్లు భావిస్తోన్న బి.1.617తో పాటు బ్రిటన్‌లో రకం బి.1.1.7 వైరస్‌ను కొవాగ్జిన్‌ టీకా తటస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన పత్రాన్ని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విటర్‌లో పంచుకున్నారు.

* కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించినా కొందరు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రాణం మీదికి వస్తున్నా ఖాతరు చేయడం లేదు. ఆదివారం కావడంతో హైదరాబాద్‌ నగరంలోని పలు చేపల మార్కెట్లు, చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడంతో పాటు అక్కడికి వచ్చిన వారు కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. భౌతిక దూరం పాటించలేదు సరికదా.. మాస్కులు కూడా సరిగా ధరించలేదు. కూకట్‌పల్లి- జగద్గిరిగుట్ట మార్గంలో ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి రావడంతో కరోనా నిబంధనలు గాల్లో కలిసిపోయాయి.

* రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కరోనా టీకాలు ఆదివారం భారత్‌కు చేరుకున్నాయి. రెండో విడత కింద 60 వేల టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత కింద 1.50 లక్షల డోసులు మే 1న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే.

* ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 94,550 నమూనాలను పరీక్షించగా… 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

* భారతీయ రైల్వే మరో మైలురాయి అందుకుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సేవలు ఇప్పటి వరకు ఆరువేల స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్‌ స్టేషన్‌లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని చేరుకుంది.

* హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్‌, శంషాబాద్‌, గగన్‌పహాడ్‌, లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, బార్కాస్‌ ప్రాంతాల్లో వాన పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది.

* న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని జ‌న‌సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఖండించారు. ప్ర‌భుత్వ తీరును లోక్‌స‌భ స్పీక‌ర్ సుమోటోగా తీసుకొని విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు. ఎంపీగా ర‌ఘురామ‌కు ఉండే హ‌క్కుల‌ను ప్ర‌భుత్వం కాల‌రాసిన‌ట్లు తెలుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచార‌ణ పేరుతో ఎంపీ ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు.

* వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై కాసేపట్లో జిల్లా కోర్టుకు మెడికల్‌ బోర్డు నివేదిక ఇవ్వనుంది.

* కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె శాంతియుతంగా నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని.. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని డిమాండ్‌ చేశారు.

* కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోన్న కర్ణాటక ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి చర్యలతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాలపై దృష్టి సారించింది. వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చే ప్రజలు వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆసుపత్రులు, ఆరోగ్యకేంద్రాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాలైన పాఠశాలలు, కాలేజీ ప్రాంగణాల్లోకి మార్చేందుకు సిద్ధమయ్యింది. కరోనా వైరస్ ఉద్ధృతితో కర్ణాటక అతలాకుతలమవుతోంది. నిత్యం అక్కడ కొత్తగా 40వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు తాకిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు దాదాపు 30శాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆరోగ్య సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కంటైన్‌మెంట్, నిర్వహణపై మరోసారి మార్గదర్శకాలు జారీచేశారు.