NRI-NRT

హమ్మయ్య…హ్యూస్టన్ పులి దొరికిందోచ్!

హమ్మయ్య…హ్యూస్టన్ పులి దొరికిందోచ్!

యజమాని ఇంటి నుంచి తప్పించుకుని, హ్యూస్టన్ వీధుల్లో పరుగులు తీసి జనాలను దడుసుకునేలా చేసిన పెద్దపులిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు. బెంగాల్ టైగర్ జాతికి చెందిన ఆ పులి పేరు ఇండియా. పులిని చూసినవారు దాని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులి సంచరిస్తున్నది పిల్లాపాపలతో కూడిన బస్తీ కావడంతో డ్యూటీలో లేని ఓ పోలీసు అధికారి దానిపై తన సర్సీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు కూడా. ఈ వీడియో కూడా వైరల్ అయింది. కానీ పులి మాత్రం దొరకలేదు. అది ఓ పెంపుడు పులి. 26 ఏళ్ల విక్టర్ హ్యూగో క్యూవస్ దాని యజమాని. అతడు ఓ హత్యకేసులో నిందితుడు. బెయిలు పైన తిరుగుతున్నాడు. పోలీసులు పులి కోసం వీధుల్లో వెతుకుతుండగానే విక్టర్ కారులో పులిని ఎక్కించుకుని ఉడాయించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఇల్లంతా గాలించినా పులి జాడ కనిపించక పోవడంతో ఖంగు తిన్నారు. పులివేట ఇంకా కొనసాగుతున్నదని ట్విట్టర్‌లో హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు పులి సురక్షితంగా, ఆరోగ్యంగా దొరికింది. దానివల్ల ఇతరులకూ హాని జరగకపోవడంతో పోలీసులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే బరువు ప్రకారం (175 పౌండ్లు) ఆ పులిని పెంపుడు జంతువుగా ఉంచుకోవడం స్థానిక నిబంధనలకు విరుద్ధం. అది ఇంకా పిల్లే. పూర్తిగా ఎదిగితే 600 పౌండ్ల బరువు ఉంటుంది. దాని వాడిగోళ్లు చాలా ప్రమాదకరం. తిక్క రేగితే ఎవరికైనా తీవ్ర నష్టం చేగలదు. కాకపోతే బాగా మచ్చిక చేసింది కావడం వల్ల పెద్దగా ముప్పు ఏర్పడలేదు. ప్రస్తుతం దానిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. హ్యూస్టన్ పోలీసులు ట్విట్టర్‌లో పెట్టన పులి వీడియోను 47 వేలమందికి పైగా చూశారు.