WorldWonders

50శాతం మంది భారతీయులు మాస్కు వాడట్లేదు-తాజావార్తలు

50 Percent Of Indians Are Not Wearing A Mask Says Govt

* దేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా అనేకమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్‌లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్‌లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా పెట్టుకోవడంలేదని ఓ అధ్యయనంలో తెలిందని పేర్కొంది. 20 శాతం మంది గడ్డం దగ్గరకు మాస్క్‌ తీసుకొచ్చి ఉంచుతున్నారని, మరో 2శాతం మంది మెడ దగ్గర ఉంచుతున్నట్టు ఆందోళన వ్యక్తంచేసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే మాస్క్‌లు సరిగా పెట్టుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారు మాత్రమే వైరస్‌ ప్రవేశించకుండా పకడ్బందీగా ముక్కు, నోరు, గడ్డాన్ని కప్పి ఉంచేలా మాస్క్‌లు పెట్టుకొంటున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. దేశంలో లక్ష కన్నా ఎక్కువ యాక్టివ్‌ కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. 50వేల నుంచి లక్ష యాక్టివ్‌ కేసులు 9 రాష్ట్రాల్లో; 50వేలకు పైగా క్రియాశీల కేసులు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు వివరించారు. కర్ణాటక, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో 25శాతం పాజిటివిటీ రేటు ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయాలంటే భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించడం అవసరమని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

* వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. న్యాయమూర్తులు వినీత్‌ శరణ్‌, వీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే రఘురామ బెయిల్‌కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో రఘురామ ఆరోగ్య నివేదికను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పంపారు.

* ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈ నెల‌తో మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్ ప‌ద‌వీకాలం ముగియ‌నుండ‌టంతో.. స‌మావేశాల అనంత‌రం ఆయ‌న‌కు వీడ్కోలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. తన పదవి ముగుస్తోందని, సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నారు. తనకు ఈ పదవి ఎవరో ఇచ్చారని అనుకోవడం లేదని, రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ‘అందరూ నాకు సహనం ఎక్కువ అంటున్నారు. కానీ నాకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సహనం ఎక్కువ. బిల్లు ఘటన జరిగిన 3 రోజులకు ఓ కార్యక్రమంలో సీఎంను కలిశా. జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా హై టీ కార్యక్రమంలో కలిశా. సీఎం జగన్‌ చాలా అప్యాయంగా షరీఫ్‌ అన్న అని పలకరించారు. ఎందుకు కలత చెందారని స్వయంగా అడిగారు. గతంలో ఏ పెద్ద పదవులు చేయలేదు, నేరుగా ఛైర్మన్‌ అయ్యానని చెప్పాను. మండలిలో కీలక నిర్ణయాల దృష్ట్యా కలత చెందానని సీఎంకు చెప్పా. నన్ను అత్యంత గౌరవంగా చూసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు’ అని భావోద్వేగానికి లోనయ్యారు.

* శునకాలు కొవిడ్‌ రోగులకు గుర్తించగలవా.. అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. వారు తాజాగా చేసిన పరీక్షల్లో శిక్షణ పొందిన శునకాలు 97శాతం కచ్చితత్వంతో వైరస్‌ను గుర్తించినట్లు తేలింది. ఈ పరిశోధనలను ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు నిర్వహించారు. అంతేకాదు.. నెగిటీవ్‌ పేషెంట్లను గుర్తించడంలో 91శాతం కచ్చితత్వంతో పనిచేశాయి. ప్రస్తుత ఫలితాలు ఇచ్చే చాలా యాంటీజెన్‌ పరీక్షల కంటే ఇవి ఎక్కువ కచ్చితత్వంతో ఇస్తున్నట్లు శాస్త్రవ్తేత్తలు వెల్లడించారు. దీంతోపాటు కొన్ని సెకన్లలో ఫలితాలు వచ్చేస్తాయంటున్నారు.

* భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిని మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్‌ కలవరపెడుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇకపై బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

* కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్‌ వేళ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) వెల్లడించింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్‌ 31గా సీబీడీటీ గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.

* రెండేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబాన్ని, ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్నీ దృష్టిలో ఉంచుకుని అడుగులు ముందుకు వేశామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని చెప్పారు. బడ్జెట్‌ సమావేశంలో భాగంగా గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారికి శాసనసభ సంతాపం తెలిపింది. సీఎం సహా సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జగన్‌ వివరించారు.

* బిట్‌కాయిన్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలెన్‌ మస్క్‌ను కూడా ఊరించింది. దానిని కొననందుకు మస్క్‌ ట్విటర్‌లో చాలాసార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒక్క మస్కే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది బిట్‌కాయిన్‌ కొననందుకు తమను తాము నిందించుకొన్నారు. కానీ, ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారుతోంది. బిట్‌కాయిన్‌ ఒక్క ఏడాదిలో ఎంత వేగంగా విలువను సంపాదించుకొందో.. అంతే వేగంగా కోల్పోతోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30శాతానికి పైగా విలువ కోల్పోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి చైనా.. రెండోది ఎలెన్‌ మస్క్‌.

* రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించిన తెదేపా జూమ్‌ యాప్‌ ద్వారా ఇవాళ మాక్‌ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించింది. మాక్‌ అసెంబ్లీ స్పీకర్‌గా కొండపి ఎమ్మెల్యే డి.బి.వి. స్వామి, మంత్రులుగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించారు. మాక్‌ అసెంబ్లీలో ఇవాళ కొవిడ్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మాక్‌ అసెంబ్లీ జరగనుంది. మళ్లీ రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు.

* కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కొవిడ్‌ బారినపడి నిరుపేదలు అల్లాడుతున్నారని, తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే గాంధీకి వెళ్లిన ఆయన ఏ సమస్యలు పరిష్కరించారో చెప్పాలన్నారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్‌ విమర్శించారు. ‘‘ పీపీఈ కిట్‌ లేకుండా సీఎం ఆస్పత్రికి వెళ్లడం తప్పు. ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన ఆయనకు అక్కడి సమస్యలు కనబడలేదా? గాంధీలో టెక్నీషియన్లు, వెంటిలేటర్ల కొరత ఉంది. వైద్యులు, ఇతర సిబ్బంది సమస్యలు సీఎం ఎందుకు వినలేదు’’ అని బండి ఆరోపించారు. ప్రజల ఆర్తనాదాలు ఆయనకు వినిపించడం లేదన్నారు.