అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 6వ అమెరికా తెలుగు సంబరాల ముగింపు రోజు అయిన ఆదివారం శ్రీనివాస కళ్యాణంతో ప్రారంభమయింది. ప్రేం కలిదింది, ఆది గెల్లి దంపతులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. యుగంధర శర్మ కళ్యాణ క్రతువును నిర్వహించిన అనంతరం తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు వితరణ జేశారు. నాట్స్ డైరక్టర్ల బోర్డు నాట్స్ BOD చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశమయి 2021 7వ అమెరికా తెలుగు సంబరాల వేదికను ఖరారు చేశారు. ఆ వివరాలు నేటి సాయంత్రం ప్రధాన వేదికపై వెల్లడిస్తామని గుత్తికొండ తెలిపారు. అనంతరం నాట్స్ కార్యవర్గం అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు నేతృత్వంలో సమావేశమయి సేవా కార్యక్రమాలు, హెల్ప్‌లైన్ వంటి వాటికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. అమెరికాలో పుట్టిపెరిగిన స్థానిక సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు అష్టావధానంతో అతిథులను అబ్బురపరిచారు. సాన్వి రాచకొండ, నీహారిక తాళ్ళపాక, హాసిని సుంకవల్లి, హర్షిత ఉప్పులూరి, వైష్ణవి ఆదిమత్యం, క్షేత్రా పోలవరపు, నిష్ణాత్ పోలవరపు, విష్ణు మారెళ్ల(అవధాని),అఖిల్ వెలటూరి, మమశ్రీ మాల్కాపురపులు ఈ కార్యక్రమంలో తమ తెలుగు ప్రతిభను సభకు పరిచయం చేశారు. అవధాన కార్యక్రమాన్ని సుజనీ, రాయవరం విజయభాస్కర్, స్థానిక సిలికానాంధ్ర బృందం సమన్వయపరిచింది. యువతీయువకుల నాట్యాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు రమ్యంగా సాగాయి. అనంత్ మల్లవరపు నేతృత్వంలో నిర్వహిస్తున్న సాహిత్యవేదికలో నేడు 6 పుస్తకాలను ఆవిష్కరించారు. “మా బాణీ-మీ వాణి” పేరిట హిందీ పాటలను తెలుగులోకి తర్జుమా చేసి ఓ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అనంత్ తెలిపారు. మధ్యాహ్నం విందు భోజనంలో బొబ్బర్ల వడలు, అమరావతి చేపల పులుసు చవులూరించాయి.
శ్రీనివాసుని కళ్యాణంతో మొదలైన నాట్స్ సంబరాల ముగింపు వేడుక
Related tags :