Business

హైదరాబాద్ గృహాలకు మాంచి గిరాకీ-వాణిజ్యం

Good Demand For Hyderabad Houses-Business News

* వాహన కంపెనీలు, రవాణా సంస్థల లెక్కల ప్రకారం గడిచిన రెండు నెలల వ్యవధిలో ట్రక్కుల అద్దెలు 10–12 శాతం దాకా ఎగిశాయి. దీంతో చాలా మటుకు కంపెనీలు ప్రస్తుతం సరుకు రవాణా చార్జీలపై చర్చలు జరుపుతున్నాయి. రవాణా చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంజీ మోటర్‌ వంటి వాహనాల తయారీ సంస్థలు .. తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నాయి. సాధారణంగా కారు ఖరీదులో రవాణా వ్యయాలు 2–2.5 శాతం మేర ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రక్‌ అద్దెలు 12 శాతం దాకా పెరిగిపోవడంతో తమ కార్ల ధరలను మరో విడత 2–3 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, సరకు రవాణా సంస్థల కష్టాలు మరో రకంగా ఉన్నాయి. సాధారణంగా ట్రక్కుల సరీ్వసులకు సంబంధించి 45 శాతం వ్యయాలు ఇంధనానిదే ఉంటోంది. కరోనా వైరస్‌ తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఇంధనాల ధరలు 65 సార్లు మారడంతో రేట్లు 30 శాతం దాకా పెరిగాయని లాజిస్టిక్స్‌ సంస్థ రివిగో వ్యవస్థాపకుడు దీపక్‌ గర్గ్‌ తెలిపారు. వ్యయాలు తక్షణం 15–20 శాతం తగ్గకపోతే ట్రక్కింగ్‌ పరిశ్రమకు మరింత కష్టకాలం తప్పదని పేర్కొన్నారు.

* కంటెంట్, యాప్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ఇండస్‌ ఓఎస్‌ను.. డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం ఫోన్‌ పే సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం కుదిరితే ఫోన్‌ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్‌ తదితర విభాగాలతో కూడిన సూపర్‌ యాప్‌ ‘స్విచ్‌’ను ఫోన్‌ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్‌ను ఫోన్‌ పే రూపొందించింది. కాగా.. దేశీ భాషల కంటెంట్‌ ద్వారా ఇండస్‌ ఓఎస్‌ వినియోగదారులకు చేరువైంది. వెరసి ఇండస్‌ ఓఎస్‌ కొనుగోలు ద్వారా ఫోన్‌ పే స్థానిక డెవలపర్స్‌ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

* కొవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, హైదరాబాద్‌ స్థిరాస్తి విపణి వృద్ధి పథంలో సాగుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇక్కడి నివాస గృహాల అమ్మకాలు 39 శాతం పెరిగాయని ఆన్‌లైన్‌ స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌.కామ్‌ శుక్రవారం వెల్లడించింది. నూతన ఇళ్ల నిర్మాణంలోనూ 95 శాతం వృద్ధి కనిపిస్తోందని తెలిపింది. ఇళ్ల అమ్మకాలకు ఇక్కడ తక్కువ సమయమే పడుతోందని, మార్చి త్రైమాసికంలో 7,721 ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. 2020 ఇదేకాలంలో ఈ సంఖ్య 5,554గా నమోదయ్యింది. విలువ పరంగా దాదాపు 34 శాతం వృద్ధితో రూ.8,400 కోట్లకు చేరింది. 2-3 పడకగదుల ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. రూ.75 లక్షల విలువైన గృహాలు ఎక్కువగా అమ్ముడవుతుండగా, తదుపరి స్థానంలో రూ.45-75 లక్షల గృహాలున్నాయి. సంగారెడ్డి, బాచుపల్లి, కొంపల్లి, కొండాపూర్‌ లాంటి ప్రాంతాలు ఈ డిమాండుకు ప్రధాన కారణం.