మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్‌విక్ పట్టణంలో ఓ భారతీయ కుటుంబం ‘లక్కీ స్టాప్’ పేరిట దుకాణం నిర్వహిస్తోంది. ఈ దుకాణానికి తరచూ వచ్చే లీ రోజ్ ఫిగా అనే స్థానిక మహిళ గత మార్చిలో వారి వద్ద డైమండ్ మిలియన్స్ స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్ కొంది. లాటరీ ఫలితాన్ని చూసుకునేందుకు ఇటీవల దుకాణానికి వచ్చిన లీ రోజ్ ఫిగా పరధ్యానంలో టికెట్ గీకి (స్క్రాచ్-ఆఫ్) చూసింది. ‘మధ్యాహ్న భోజన విరామంలో దుకాణానికి వెళ్లా. సమయం తక్కువగా ఉంది. ఆ ధ్యాసలో టికెట్‌ను పైపైన గీకి చూసి లాటరీ తగల్లేదులే అంటూ అక్కడే పడేసి వచ్చేశా’ అని ఆమె తెలిపింది. అక్కడే చెత్తలో పది రోజులపాటు పడున్న ఆ టికెట్ దుకాణ యజమాని కుమారుడు అభి షా కంటపడింది. టికెట్ చూస్తే పూర్తిగా గీకలేదు. ఆ ప్రయత్నం పూర్తి చేసిన అభి అవాక్కయ్యాడు. మిలియన్ అమెరికన్ డాలర్లు ఆ టికెట్ గెలుచుకుంది. తన తల్లి అరుణా షా విక్రయించిన ఆ టికెట్ చేత పట్టుకొన్న అభి ‘నేను మిలియనీర్’ అంటూ కాసేపు కలల్లో తేలిపోయాడు. ఖరీదైన టెస్లా కారు కొందామని అనుకున్నాడు. ‘రెండు రాత్రులు మా కుటుంబానికి నిద్ర లేదు’ అని దుకాణ యజమాని మౌనిశ్ షా తెలిపారు. ఇండియాలో ఉంటున్న తాతయ్య, నానమ్మలకు అభి ఫోను చేసి విషయం చెప్పాడు. ‘ఆ డబ్బు మనకు అక్కర్లేదు. టికెట్ ఎవరు కొన్నారో వాళ్లకు ఇచ్చేయండి’ అని వాళ్లు నిష్కర్షగా చెప్పారు. మారు మాట్లాడకుండా ఆ టికెట్‌ను విజేతకు అప్పగించాలని మౌనిశ్ షా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ విషయం లీ రోజ్ ఫిగాకు చెప్పగానే.. ఆమె కాసేపు నమ్మలేదు. తర్వాత షా కుటుంబాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇపుడు అభి కుటుంబాన్ని ప్రశంసిస్తూ ప్రతిరోజూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ‘ఆ టికెట్ మా దగ్గరే ఉంచుకొని ఉంటే.. ఈ ఆనందం ఉండేది కాదు’ అని అభి అంటున్నాడు.
అమెరికన్ భారతీయుల్లో అవినీతిపరులే కాదు…ఇలాంటి వారు కూడా ఉన్నారు
Related tags :