రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ సడలింపు దృష్ట్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా నేటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించింది. స్లాట్ల బుకింగ్ విధానంలో తహశీల్దార్ కార్యాలయ్యాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతాయని పేర్కొంది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రోజుకు 24 స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇద్దురు సబ్‌రిజిస్ట్రార్లు ఉన్నదగ్గర రోజుకు 48 స్లాట్లు ఉంటాయని వెల్లడించింది. క్రయ, విక్రేతలతోపాటు ఇద్దరు సాక్షులకు ఆన్‌లైన్ పాస్‌లు మంజూరు చేస్తామని, ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఏడుగురికి మించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది. ఈసీలు, సీసీలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జారీచేయాలని పేర్కొంది.