* మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. కొవిడ్ ఉద్ధృతి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్ రెపో రేటు 3.35శాతంగా ఉన్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఇక కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కాస్త నెమ్మదించింది. దీంతో ఈసారి కూడా సర్దుబాటు విధాన వైఖరినే కొనసాగించనున్నట్లు దాస్ వెల్లడించారు.
* భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)’ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టకుకు ‘పీ -75 ఇండియా’ పేరిట త్వరలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్ఎఫ్పీ జారీకి కావాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు పేర్కొన్నాయి. జలాంతర్గాముల స్పెసిఫికేషన్లు సహా ఇతర అవసరాలను రక్షణ మంత్రిత్వ శాఖ, భారత నావికాదళం సహా ఇతర బృందాలు కలిసి పూర్తిచేశాయని తెలిపాయి. సముద్ర జలాల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచనున్నట్లు ప్రకటించడంతో ఉదయం లాభాల్లో ఉన్న మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మరోవైపు కొన్ని కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలను కిందకు దిగజారాయి. చివరకు సెన్సెక్స్ 132 పాయింట్ల నష్టంతో 52,100 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 15,670 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద స్థిరపడింది.
* ఉద్యోగుల జీతాల వంటి భారీ చెల్లింపులు నిర్వహించే ది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ సిస్టమ్ (నాచ్) ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకులు తెరిచిన రోజుల్లోనే అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని కేంద్ర బ్యాంక్ పేర్కొంది.
* హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా షైన్ బైక్ ధరను పెంచింది. ప్రస్తుతం హోండా తయారు చేసే బైకుల్లో ఇదే అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్. దీని ధర రూ.1,072 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డ్రమ్ బ్రేక్ వేరియంట్ షైన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.71,550గా ఉండగా.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,346గా ఉంది. ఇప్పటికే ఈ బైకును ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి, ఈఎంఐలపై కొనుగోలు చేసే వారికి రూ.3,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.