కొవిడ్ నుంచి కోలుకున్న పిల్లల్లో పలువురు ఎంఐఎస్-సి (మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్- మిస్సీ) బారినపడుతున్నారు. దీని బాధితుల్లో చిన్నారులు, పురిట్లో ఉన్న శిశువులూ ఉంటున్నారు. దీనికి తగిన చికిత్స అందుబాటులో ఉన్నందున సకాలంలో వైద్యుల్ని సంప్రదిస్తే పిల్లలు వెంటనే కోలుకుంటారని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కరోనా తొలిదశలో వైరస్ సోకిన పిల్లలు 4శాతమే ఉండటంతో ‘మిస్సీ’ కేసులూ వెలుగుచూడలేదు. రెండో దశలో వైరస్ వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉంది. 18 ఏళ్లలోపు వారు గరిష్ఠంగా 15% మంది కొవిడ్ బారినపడ్డారు. ఆ మేరకు మిస్సీ కేసులూ బయటపడుతున్నాయని పీడియాట్రిక్ కొవిడ్-19 టాస్క్‌ఫోర్సు కమిటీ సభ్యులు, సీనియర్ వైద్యులు డాక్టర్ టీసీ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు 50 కేసులు చూడగా చికిత్సతో అందరూ కోలుకున్నారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో సుమారు వంద కేసులు నమోదయ్యాయి. తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో 4, నెల్లూరు ఆసుపత్రికి ఒక కేసు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మరికొన్నిచోట్ల ఇవి వెలుగులోనికి రావడంలేదు. గుంటూరులోని జీజీహెచ్‌లో మిస్సీ లక్షణాలతో 26 మంది పిల్లలు ఇప్పటివరకు చేరారు. వీరిలో 20 మంది కోలుకోగా, ఇద్దరు మరణించినట్లు వైద్యులు డాక్టర్ పద్మావతి తెలిపారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. బాధితుల వయసంతా ఏడాది నుంచి 12 ఏళ్ల మధ్యే ఉంది. వీరిలో అత్యధికులు రెండు నుంచి మూడు వారాల ముందే కరోనా బారినపడి, కోలుకున్నారు. కానీ, ఈ విషయం ఎవరికీ తెలియదు. జ్వరం, కడుపు నొప్పితో ఆసుపత్రులకు వస్తే వైద్యులు పరీక్షించి (యాంటీబాడీ టెస్టు) వీరికి వైరస్ సోకి, తగ్గినట్లు గుర్తించారు. బాధితుల్లో అధిక శాతం కడుపు నొప్పితో వచ్చారని పద్మావతి వెల్లడించారు. తలకు, మెడకు మధ్య భాగంలో చర్మం కింద చిన్న గడ్డలు రావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలూ బాధిత పిల్లల్లో కనిపించాయన్నారు. చిన్న వయస్సు నుంచే గుండె, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారిని మిస్సీ మరింత ఇబ్బంది పెట్టింది.
తల్లి నుంచి బిడ్డకు
* కరోనా నుంచి కోలుకున్న గర్భిణిలోని యాంటీబాడీలు గర్భస్థ శిశువులోకి చేరుతున్నట్లు పలువురి పరీక్షల్లో తేలిందని వైద్య నిపుణులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో ఓ గర్భిణి జ్వరంతోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు మూడు రోజులుగా మిస్సీతో బాధపడుతోంది. తల్లికి ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేశారు. యాంటీజెన్ టెస్టులో నెగెటివ్‌గా తేలినా.. వైద్యులు యాంటీబాడీ (ఐజీజీ) పరీక్ష చేయించారు. అందులో ఆమెకు యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. ఇవే శిశువుకు సంక్రమించాయని, తల్లికి గతంలో వైరస్ వచ్చి వెళ్లిందనే నిర్ణయానికి వచ్చారు. జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న శిశువు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది.
* గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి కరుణకు కరోనా సోకింది. ప్రసవం అయ్యే సమయానికి ఆమెకు కొవిడ్ లేదు. మే 30న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు కడుపు ఉబ్బరంగా ఉండి, పసరు వాంతులయ్యాయి. మలవిసర్జన జరగడం లేదు. పాలు తాగడం లేదు. గుంటూరులోని పిల్లల శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ యర్రా రాజేష్.. పరీక్షలు చేసి శిశువు పేగులో ఇన్‌ఫెక్షన్ (గ్యాంగ్రిన్) ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన పేగు భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కరోనా బారినపడటంతో గర్భస్థ శిశువుకీ ఇన్‌ఫెక్షన్ సోకిందని రాజేష్ తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
అయిదేళ్ల నుంచి పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయని చిన్నపిల్లల వైద్య నిపుణులు బి.లోకేశ్వరి తెలిపారు. మిస్సీ బారినపడిన చిన్నారుల్లో ప్లేట్‌లేట్లు తగ్గొచ్చు, పెరగొచ్చు. ప్లేట్‌లెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెలోని రక్తనాళాలు ఉబ్బిపోవచ్చని వివరించారు.
* ఎంఐఎస్-సి బారినపడిన వారికి ప్రధానంగా జ్వరం వస్తుంది. దీంతోపాటు పొట్టనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలూ ఎక్కువ కేసుల్లో బయటపడుతున్నాయి.
* ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబడటం, ఒంటిపై దద్దురు,్ల కాళ్ల వద్ద వాపులు, పలువురు పిల్లల్లో నాలుక, పెదాలు ఎర్రగా మారి పెదాలు పగిలిపోయినా అనుమానించాలి.
* వైరస్ నివారణకు చికిత్స పొందిన అనంతరం రెండో వారంలో వరుసగా 3 రోజులు జ్వరం వస్తే మిస్సీగా భావించాలి. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కొవిడ్ తగ్గాక జ్వరం వచ్చి 24 గంటలు దాటినా తగ్గకపోతే మిస్సీ కింద పరిగణించాలి.