కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అనేక మంది ప్రాణాలు కాపాడేందుకు చేసిన కృషిని ఓ చిన్నారి కొనియాడింది. ఈ మేరకు కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని లిద్వినా జోసెఫ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసింది. లేఖ రాయడమే కాకుండా సీజేఐ రమణ, జాతీయ చిహ్నం, జాతీయ పతాకం, సీజేఐ తన చేతిలోని సుత్తితో కరోనా వైరస్‌ను చంపుతున్నట్లు చిత్రాన్ని గీసి లేఖతో పాటు పంపించింది. దిల్లీ సహా అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా చేసి ప్రాణాలు కాపాడటం, కొవిడ్ బాధితులకు అవసరమైన ఔషధాలు అందించడానికి అవసరమైన ఆదేశాలను ఇవ్వడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషించిందని చిన్నారి తన లేఖలో పేర్కొంది. న్యాయవ్యవస్థ చేసిన కృషికి తాను అభినందనలు తెలియజేస్తున్నట్లు వివరించింది. న్యాయవ్యవస్థకు కితాబిస్తూ హృదయాన్ని ఆకుట్టుకునేలా స్వదస్తూరితో విద్యార్థిని రాసిన లేఖపై సీజేఐ స్పందించారు. విద్యార్థినిని ఆశీర్వదిస్తూ, అభినందనలు తెలుపుతూ చిన్నారికి జస్టిస్ ఎన్వీ రమణ తిరిగి లేఖ రాశారు. చిన్న వయసులోనే సామాజిక స్ఫృహతో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతి నిర్మాణంలో బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదగాలని సీజేఐ ఆకాంక్షించారు.
జస్టిస్ ఎన్.వి.రమణకు 5వ తరగతి చిన్నారి లేఖ
Related tags :