Health

మీ టీకా సర్టిఫికేట్‌లో తప్పులు ఉన్నాయా?-TNI కోవిద్ బులెటిన్

మీ టీకా సర్టిఫికేట్‌లో తప్పులు ఉన్నాయా?-TNI కోవిద్ బులెటిన్

* ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నాలుగు లక్షల ఇరవై వేల కోవిషిల్డ్ వ్యాక్సిన్.

* దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది.వరుసగా రెండో రోజూ కొత్త కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.సుమారు రెండు నెలల తరవాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది.అయితే క్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.తాజాగా 92,596 మందికి కరోనా సోకగా..2,219 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.మంగళవారం 19,85,967 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,596 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 2.9 కోట్ల మార్కును దాటాయి.పాజిటివిటీ రేటు రెండో రోజు 5 శాతానికి దిగువనే నమోదైంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్టుగా 5 శాతం దిగువనే ఈ రేటు కొనసాగుతుండటం ఊరటనిస్తోంది.

* కొవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్సు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం తెలిపింది.

* కోవిడ్-19 వ్యాక్సిన్ లబ్ధిదారులు ఇకపై తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లలో తప్పులను కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా సరిదిద్దుకోవచ్చు.పేరు, పుట్టిన సంవత్సరం, స్త్రీ, పురుషుడు వంటివాటిలో తప్పులు దొర్లితే, సరిదిద్దుకునేందుకు వీలు కల్పించే ఫీచర్‌ను కోవిన్ పోర్టల్‌లో చేర్చారు.http://cowin.gov.inకు లాగిన్ అయి తమ సమస్యను లేవనెత్తవచ్చు.ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్ తెలిపారు.వికాస్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కోవిన్‌లో ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండే కొత్త ఫీచర్.వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లో తప్పులను స్వయంగా సరిదిద్దుకోండి’’ అని తెలిపారు.ఆరోగ్య సేతు యాప్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.