Kids

స్నేహితుల సాయం-తెలుగు చిన్నారుల కథ

స్నేహితుల సాయం-తెలుగు చిన్నారుల కథ

ఒక అడవిలో కాకి, తాబేలు, జింక, ఎలుక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవారు. ఒక రోజు జింక వాళ్ళ సమావేశానికి రాలేదు. మిగతా ముగ్గురూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. “కాకి, నువ్వు పైకి ఎగిరి, జింక ఎక్కడైనా ప్రమాదం లో చుక్కుకుందేమో చూడ వూ?” అంది తాబేలు.

కాకి పై కెగిరి,”అయ్యో! జింకని ఒక వేటగాడు వలలో బంధించాడు. ఆ వేటగాడు అక్కడ లేడు కనక, వెంటనే ఎలుకని నాతోతీసుకెళ్తా,” అంటూ ఎలుకని కాకి బంధించియున్న జింక ముందు దింపింది. ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి, జింక ని బైట పడేసింది. జింక, “ఆహా! మంచి స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో!” అని ఆనందించింది.

ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావటం గమనించి, “అయ్యో ! తాబేలు అంత నెమ్మదిగా వొస్తోంది, ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వొస్తే, నేను ఆకాశం లోకి ఎగరగలను,జింక,ఎలుకా కూడా వేగంగా తప్పించుకోగలవు…కానీ తాబేలు?” అని కాకి అంటుండగానే వేటగాడు వొచ్చి, తాబేలుని పట్టుకుని, తన దగ్గరున్న కర్రకి తాడుతో కట్టేసాడు.

“అయ్యో మన మంచి స్నేహితుడు తాబేలుని ఎలా రక్షించాలి ?” అని ఆలోచించి, ఒక పథకం వేసాయి. “వేటగాడు ఎలాగు చెరువు దగ్గరకే వెళ్లి తాబేలు ని కిందకి దించుతాడు. జింక వాడికి కనిపించేలాగా ఒక చోట పడి, చచ్చినట్టు వేషం వేస్తుంది. దాని కన్ను పొడుస్తున్నట్టు నేను నటిస్తుంటా. వాడు అంతదూరం నడుస్తూ వొచ్చేలోగా, ఎలుక వెళ్లి , తాబేలుకి కట్టిన తాడు కొరికి తాబేలు చెరువు లోకి దూకేలాగా సహాయం చేస్తుంది. తీరా అంతదూరం వేటగాడు నడుస్తూ వొచ్చేసరికి, హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది, నేను ఆకాశం లోకి ఎగిరి పోతా,”అన్నది కాకి. ఈపథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి, ప్రాణరక్షణ చేసుకున్నారు.

నీతి: స్నేహం చాలా గొప్పది. స్నేహితులు సదా ఒకరికొకరు సహాయం చేసుకుంటే సాధించలేనిది ఏమీలేదు.