వరంగల్ సెంట్రల్ జైల్ కూల్చివేత ముమ్మరంగా సాగుతోంది. శనివారం తెల్లవారుజామున మొదలైన కూల్చివేత పనులు సిబ్బంది, సామగ్రి తరలింపు కారణంగా కొద్దిసేపటి తర్వాత నిలిచినట్లు సమాచారం. ఆదివారం ఉదయం నుంచి మాత్రం వేగంగా జరుగుతున్నాయి. కూల్చివేతలను పరిశీలించేందుకు మీడియాకు, జైల్ సిబ్బందికి గాని అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయనుందని వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే జైలు అధికారులు శుక్రవారం రాత్రే ఆగమేఘాల మీద ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లి జైలు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు లేఖ అందిచండం విశేషం. కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటి వరకు జైల్ అధికారులు విడుదల చేయకపోవడం గమనార్హం.
భారత దేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన సెంట్రల్ జైళ్లలో వరంగల్ కారాగారం ప్రముఖమైనది. 6వ నిజామ్ మీరు మహబూబ్ అలీ ఖాన్ హయాంలో నిర్మించిన ఈ కారాగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తీహార్ జైలు నుంచి కూడా ఎన్నో సార్లు ఖైదీలు తప్పించుకొని వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. కానీ135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వరంగల్ జైలు నుంచి ఇప్పటివరకు ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోలేదంటే, ఈ జైలు నిర్మాణం ఎంత పకడ్బందీగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులైన కాసూ సన్యాల్, కాళోజి, దాశరధి, వీవీ, మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ప్రముఖులు ఈ జైలులో ఉన్నారు. భారత్ ను సందర్శించడానికి వచ్చిన అనేక మంది విదేశీ చరిత్రకారులు తమ గ్రంధాల్లో ఈ కారాగారం గురించి పేర్కొనడం విశేషం. నిజాం ప్రభుత్వంలో హన్కిన్ అనే అధికారి జైళ్ల శాఖ అధిపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత 1885 లో వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం జరిగింది. భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరివర్తనకు మారుపేరుగా నిలిచిందీ వరంగల్ సెంట్రల్ జైల్.
వరంగల్ జైలు కూల్చివేత ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న గోప్యత అర్థం కానీ రీతిలో ఉండటం గమనార్హం. మీడియాను సైతం అనుమతించకుండా జైలు గేట్లు మూసేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేత లను కొనసాగిస్తున్నారు. కేఎంసీ నుంచి వరంగల్ వైపు రోడ్డును క్లోజ్ చేసేశారు. ఎంజీఎం సెంటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. జైల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్‌ను సైతం క్లోజ్ చేయడం విశేషం. సెంట్రల్ జైల్లో కూల్చివేతలు జరుగుతుంటే రోడ్డుపై కూడా నిర్బంధాలు ఎందుకంటూ జనం మండిపడుతున్నారు. అసలు కూల్చివేత విషయాన్ని ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారో అధికారులకే తెలయాలంటూనే, వారిది అర్థం లేని వైఖరి అంటూ జనాలు తప్పు పడుతున్నారు.