సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్(తిమింగలం వాంతి) పదార్థం తమ వద్ద ఉందని నకిలీ పదార్థాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలాపత్తర్‌కు చెందిన వస్త్ర వ్యాపారి షకీర్ అలీ(38), ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌కు చెందిన రియల్టర్ షేక్ అలీ(60), విజయనగర్‌కాలనీకి చెందిన పౌల్ట్రీ వ్యాపారి మహమ్మద్ ఆరిఫ్(60), బండ్లగూడకు చెందిన మహమ్మద్ నజీర్, చుడీబజార్‌కు చెందిన రియల్టర్ మోహన్‌లాల్ యాదవ్(57), ఈది బజార్‌కు చెందిన జువెలరీ వ్యాపారి మహమ్మద్ అజారుద్దీన్(33), హుస్సేనీ ఆలంకు చెందిన మహమ్మద్ హుస్సానుద్దీన్(51) ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గది కార్యాలయంగా మార్చారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే సులేమాన్ స్టోన్ ఉందని, దానిలో మహిమలు ఉన్నాయని చెబుతూ దాన్ని చేతిలో పట్టుకుంటే చేయి నరికినా ఏమీ కాదని నమ్మిస్తున్నారు. మరో అయస్కాంత ప్లేట్ ఉంది, అది బ్రిటన్ వారు వినియోగించారు, అది ఎంతో విలువైందని నకిలీ ప్లేటు చూపుతున్నారు. సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ ఎస్‌ఐ కృష్ణయ్యతోపాటు మంగళవారం సాయంత్రం ఆ కార్యాలయంపై దాడిచేశారు. అక్కడ మోస పూరిత వస్తువులు తయారుచేసి విక్రయిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారితోపాటు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించగా ఎస్సై తేజంరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ తిమింగలం వాంతి పేరిట హైదరాబాద్‌లో మోసం
Related tags :