* డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం రూ.12 వేల కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ఇటీవల జరిగిన వాటాదారుల సమావేశంలో వెల్లడించింది. అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సంస్థ ఐపీఓ నవంబరులో వచ్చే అవకాశం ఉంది. తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద కూడా షేర్లను విక్రయించనున్నట్లు పేటీఎం తెలిపింది. ప్రస్తుతం ప్రధాన వాటాదారుల్లో ఒకరైన విజయ్ శేఖర్ శర్మకు ఉన్న ప్రమోటర్ హోదాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సుమారు రూ.22,000 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు కంపెనీ బోర్డు ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంట్లో రూ.12 వేల కోట్లు తాజా ఈక్విటీ షేర్ల ద్వారానే సమీకరించనుండడం విశేషం. ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఈ ఐపీఓ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం గురించి వినే ఉంటాం. ఈ ఫెవికాల్ ప్రకటన చూస్తే మాత్రం దానర్థం ఇదేనా అనిపించకమానదు. సరిగ్గా అదే చేసింది ఈ సంస్థ. కాకపోతే ఇక్కడ సంక్షోభం వేరొకరిది. అవకాశం మాత్రం తనది! దీంతో ఫెవికాల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ విషయం.. ప్రముఖ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరు కోకాకోలా కంపెనీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. తన ముందున్న కోక్ బాటిళ్లను పక్కన పెట్టి నీరు తాగడంటూ ఇచ్చిన సంజ్ఞ ఆ కంపెనీకి రూ.29వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీన్నే తాజాగా ఫెవికాల్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ప్రెస్కాన్ఫరెన్స్ టేబుల్‌పై కోక్ బాటిళ్ల బదులు రెండు ఫెవికాల్ బాటిళ్లను ఉంచి.. ‘దీన్నెవరు జరపలేరు.. విలువ పడిపోదు’ అనే వ్యాఖ్యను జోడించింది. దీనిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ఇంట్రాడే కనిష్ఠాల నుంచి ఏకంగా 650 పాయింట్లు కోలుకుంది. అయినప్పటికీ సూచీలు లాభాలను మాత్రం ఒడిసిపట్టలేకపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లలో అప్రమత్తత కీలక రంగాల్లో అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఉదయం కాస్త సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి జారుకుని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. తిరిగి క్రమంగా పుంజుకుని కనిష్ఠాల నుంచి పైకి ఎగబాకాయి.
* ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేడు (జూన్ 18) తన ఉద్యోగులలో 80 శాతం మంది వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాండ్ బి3(అసిస్టెంట్ మేనేజర్, దిగువ స్థాయి) అర్హులైన ఉద్యోగులందరికీ మెరిట్ వేతన పెంపు(ఎంఎస్ఐ)ను ప్రారంభిస్తుందని, ఇది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్ ఉద్యోగులు కంపెనీ శ్రామిక శక్తిలో 80 శాతంగా ఉన్నారు. ఈ క్యాలెండర్ లో ఉద్యోగులకు ఇది రెండవ వేతన ఇంక్రిమెంట్. ఈ బ్యాండ్ లలో అర్హులైన ఉద్యోగులకు జనవరి, 2021లో కంపెనీ వేతనాలను పెంచినట్లు ప్రకటించింది.