Politics

ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేస్తున్నాం-తాజావార్తలు

ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేస్తున్నాం-తాజావార్తలు

* కరోనా నిర్బంధంతో విసిగిపోయిన వారికి శుభవార్త. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మాల్స్‌, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్సులను ఈనెల 21 నుంచి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే అధిక సంఖ్యలో జనం చేరకుండా చూడాలని ఆదేశించింది. కరోనా సాంకేతిక సలహా సమితి ఈ మేరకు పలు సిఫారసులు చేసింది. కరోనా నిబంధనల నేపథ్యంలో అన్నిచోట్లా 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ఇంకా కోవిడ్‌ బెడద ఉన్నందున రెండు వారాల తర్వాతే జిమ్‌, యోగా సెంటర్లు, దేవస్థానాలు, సినిమా టాకీస్‌లు తెరవడానికి ఆమోదించాలని సర్కారుకు తెలిపింది. 21వ తేదీ తరువాత బీఎంటీసీ బస్సులు, మెట్రో రైళ్ల సంచారంపై నిర్ణయం తీసుకోనున్నారు.

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్‌ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని దుయ్యబట్టారు.

* బెయిల్‌ మంజూరుకు ఓ వ్యక్తి నుంచి జగిత్యాల పట్టణ ఎస్సై రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణం విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన బెజ్జారపు అఖిలకు గత డిసెంబర్‌ 28న మెట్‌పల్లి పట్టణం చైతన్యనగర్‌కు చెందిన బెజ్జారపు శివ ప్రసాద్‌తో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అఖిలను భర్తతో పాటు మామ భూమయ్య, అత్త నాగమణి, బావ రాజేశ్, ఆడబిడ్డ భాగ్య వేధించగా, బాధితురాలి సోదరి కట్ట మౌనిక పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మార్చి 30న అప్పటి ఎస్సై శంకర్‌నాయక్‌ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి బెయిల్‌ ఇచ్చారు.

* రాష్ట్రంలో 2021-22కు విడుదల చేసిన మొత్తం 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2,397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక, ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటికి విద్యాశాఖలో 5,812 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మంత్రి తెలిపారు.

* ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రి పదవులు కూడా చేపట్టారని.. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసునని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

* హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ గా మారింది. గులాబీ దళపతి మదిలో ఎవరున్నారు?.. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కనుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ముద్దసాని దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్‌ దక్కనుందా లేక బీసీలకే అవకాశం రానుందా? అవసరమనుకుంటే జంప్ జిలానీల వైపు కారు పార్టీ మొగ్గుచూపుతుందా? అంటే, ఎవ్వరికీ అంతుచిక్కడం లేదనే సమాధానం వస్తుంది. అయితే డజన్‌కు పైగా అశావాహులు పోటీలో ఉన్నప్పటికీ.. బీ ఫామ్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది.మాజీ మంత్రి ఈటల రాజేందర్ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో ఉత్పన్నమవుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు టీఆర్ఎస్‌లో ఉండి మంత్రిగా కొనసాగిన ఈటల, రాజీనామా చేసి బీజేపిలో చేరి ఏడో సారి ఎమ్మెల్యేగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపి అభ్యర్థిగా బరిలో నిలువనున్నారు. ఆత్మ గౌరవం పేరుతో బరిలో నిలుస్తున్న ఈటలను ఢీ కొట్టేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి వెతుకులాటలో పడింది. ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈటల బలం, బలహీనతలను బేరీజు వేసుకుంటు రాజకీయంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగా ఈటలపై పోటీ చేసేందుకు అశావాహులు జాబితా రోజురోజుకు పెరుగుతుంది. డజన్‌కు పైగా మంది ఇప్పటికే తమ పేరును పరిశీలించాలని కోరుతున్నప్పటికి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సామాజిక, రాజకీయ అంశాలతోపాటు స్థానికత, యువతను పరిగణనలోకి తీసుకుని ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్, ఇతర పార్టీల నేతల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టాప్‌ ఫైవ్‌లో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి లేదా కెప్టెన్ లక్ష్మీకాం​తరావు కుటుంబం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దామోదర్రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నియోజకవర్గంలోని మామిడాలపల్లికి చెందిన స్థానికుడు, టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.పురుషోత్తమ్ రెడ్డికి పరిపాలన పరమైన అనుభవం ఉన్నా, రాజకీయ పరమైన అనుభవం లేదు. ఇక అదే ఇంటి నుంచి దామోదర్ రెడ్డి తనయుడు కాశ్యప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. కాశ్యప్ రెడ్డి 2014లో ఈటలపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ కుటుంబం నుంచి కాకుంటే కేసీఆర్ రాజకీయంగా ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కెప్టెన్ కుటుంబంలో వొడితెల రాజేశ్వర్ రావు మనువడు ప్రణవ్ బాబు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ రెండు కుటుంబాలను కాదనుకుంటే బీసీ అయిన ఈటలను మరో బీసీ నేతతో ఢీకొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ కాదంటే ఆ స్థాయిలో ఉన్న బీసీ నేత టీసీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను సైతం పార్టీలోకి అహ్వానించి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పొన్నం ఇమేజ్, విపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానం చెప్పే సత్తా ఉన్న నాయకుడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాలు సామాజిక అంశం ప్రక్కన పెడితే మాజీ ఎంపీ వినోద్, కాంగ్రెస్‌లో ఉన్న ప్రవీణ్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్ బరిలో నిలిపి, సీఎం స్థాయి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి తీసుకువచ్చారు. అలాంటి పరిస్థితి రాజేందర్‌కు రావాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో రాజకీయంగా అనుభవం లేని వారిని బరిలో నిలిపి విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

* ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి వణికిపోయిన రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తోన్న రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నాటికి థర్డ్‌వేవ్ సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే మూడో ముప్పును సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై ఆయన కుమారుడు భరత్‌, తెదేపా ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.