ScienceAndTech

ఇదొక భయంకరమైన ల్యాప్‌టాప్

This crazy virus infested laptop is being auctioned for a record price

చాలా అరుదైన, అపురూపమైన వస్తువులు, పాతకాలం నాటి కళాఖండాలను వేలం వేయడం మనం చూస్తుంటాం. అయితే వీటన్నింటికి భిన్నంగా అత్యంత ప్రమాదకరమైన ఓ వస్తువు వేలానికి వచ్చింది. ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌పై నిర్వాహకులు వేలం నిర్వహించగా.. 1.3మిలియన్‌ డాలర్లు పలకడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు ఆర్థికంగా 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. ‘ది పర్సిస్టెన్స్‌ ఆఫ్‌ ఖోస్‌’గా పేర్కొనే ఈ డివైజ్‌లో.. ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నాక్రై’, ‘ఐలవ్‌యూ’, ‘డార్క్‌ ఎనర్జీ’, ‘సోబిగ్‌’, ‘మైడూమ్‌’, ‘డార్క్‌టెక్విలా’ వైరస్‌లు,రాన్సమ్‌వేర్‌లు ఉన్నాయి. ‘వాన్నాక్రై’ రాన్సమ్‌వేర్‌ గతంలో ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని 2 లక్షలకుపైగా కంప్యూటర్లపై దాడి చేసిన విషయం తెలిసిందే. యూకేలోని ఎన్‌హెచ్‌ఎస్‌పై ఈ రాన్సమ్‌వేర్‌ దాడి చేయడంతో దాదాపు 4 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇక ఈమెయిల్‌, ఫైల్‌షేరింగ్‌ల ద్వారా వ్యాపించే ‘ఐలవ్‌యూ’ వైరస్‌.. దాడి చేసిన తొలివారంలోనే 5.5 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చింది. ‘డార్క్‌ టెక్విలా’.. లాటిన్‌ అమెరికాలోని వినియోగదారుల బ్యాంకు ఖాతాలు, కార్పొరేట్‌ డేటాలాంటి సున్నితమైన సమాచారాన్ని తస్కరించింది. సర్వర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడూ ఈ వైరస్‌ ప్రభావం చూపించడం గమనార్హం. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ‘కంప్యూటర్లలోని వైరస్‌లు మనకు ప్రత్యక్షంగా ఎలాంటి హాని చేయవని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని వైరస్‌లు పవర్‌గ్రిడ్లు, పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లపై దాడి చేసి భౌతికంగా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి’ అని ఓ డాంగ్‌ తెలిపారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని.. దీన్ని అకడమిక్‌ ప్రయోజనాల కోసమే వినియోగించాలని నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.