* కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం చెల్లించకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాని ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ(ఎన్ఎండీఏ)లో ఈ మేరకు తీర్మానం చేశారా? అని అడిగింది. పరిహారం చెల్లించడం ఆర్థిక సామర్థ్యానికి మించిన వ్యవహారమంటూ ప్రమాణ పత్రంలో తెలిపిన కేంద్రం దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘దీనర్థం ప్రభుత్వం వద్ద నిధులు లేవని కాదు. ఇలా పరిహారం ఇస్తే ఉన్న నిధులను వైద్యరంగ మౌలిక వసతుల కల్పన, అందరికీ ఆహారం అందజేత, దేశ ప్రజలందరికీ టీకాల పంపిణీ, ఆర్థిక రంగ ఉద్దీపనలకు కాకుండా ఇతర పనులకు వెచ్చించినట్టు అవుతుందన్నదే ఉద్దేశం’’ అంటూ తెలిపింది.
* ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు కేరళ తెలిపింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
* కొవిడ్-19పై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.శ్వేత పత్రం లక్ష్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కాదని, కరోనా మూడో దశ దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అని తెలిపారు.దేశంలోకి కొవిడ్ థర్డ్ వేవ్ రానుందని ప్రజలకు తెలుసని వివరించారు.దేశంలో కరోనా మొదటి, రెండో దశను అడ్డుకోవటంలో కేంద్రం విఫలమైందన్నారు.కొవిడ్ వైరస్ పరివర్తనం చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో మరిన్ని వేవ్‌లు రావొచ్చని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
* ఈసారీ అమర్నాథ్ యాత్ర రద్దు.కరోనా కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమర్నాథ్ యాత్ర నిర్వహించడం లేదు.జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు 56 రోజుల పాటు ఈ యాత్ర జరగవలసి ఉండగా, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేశారు.అయితే అమర్నాథ్ గుహలో మాత్రం లాంఛనంగా అర్చనలు జరుగుతాయని జమ్మూ- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, దేవస్థానం బోర్డు ఛైర్మన్ అయిన మనోజ్ సిన్హా సోమవారం తెలిపారు.సంప్రదాయం ప్రకారం అన్ని పూజలూ చేస్తారని తెలిపారు.ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం అయిదు గంటలకు ఇచ్చే హారతిని అరగంట పాటు యాప్‌లు, ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని చెప్పారు.ఈ రూపంలో భక్తులు దైవ దర్శనాన్ని చేసుకోవాలని కోరారు.