అనుమతుల్లేకుండా నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి వ్యవహారశైలిపై హైకోర్టు మండిపడింది. మంగళవారం ఈ అప్పీలును విచారిస్తున్న క్రమంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని వివరాలను ఉటంకిస్తూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికార పార్టీ అండ చూసుకుని పిటిషనర్ వాస్తవాలను తొక్కిపెట్టారని, అధికారులను బెదిరించారని, న్యాయవాదిపై భౌతికదాడులకు పాల్పడ్డారని సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఎంత బలవంతుడివో తామూ చూస్తామని, ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని’’ పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీలోని 1,200 చదరపు గజాల స్థలంలో వి.గోపాల్‌రావు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టారు. అది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ పంచాయతీ ఏప్రిల్ 21న కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గోపాల్‌రావు పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి దానిని కొట్టివేశారు. అనుమతులను తిరస్కరిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని సవాలు చేయకపోవడంతోపాటు హైకోర్టులో ఉన్న మరో పిటిషన్ వివరాలను తొక్కిపెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించారు. ‘‘మీ (గోపాలరావు)పై చర్య తీసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి, తదితరులను బదిలీ చేయించారు. అక్రమ నిర్మాణంపై ఓ వ్యక్తి పిటిషన్ వేయగా ఆయన న్యాయవాదిని బెదిరించారు. ఉపసంహరించుకోవడానికి నిరాకరించడంతో భౌతిక దాడులకు పాల్పడ్డారు. బలవంతంగా ఎన్వోసీపై సంతకం తీసుకున్నారు. మరో న్యాయవాది వస్తే ఆయన్నూ బెదిరించారు’’ అని పేర్కొంటూ గోపాలరావు పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గోపాలరావు దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం గోపాలరావు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అంత బలవంతుడైతే ఈ వ్యవహారాన్ని తామే పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని గోపాలరావును ఆదేశిస్తూ విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.