NRI-NRT

NRI ఆసుపత్రి లుకలుకలు. తెల్లకాగితంపై కమిటీ ప్రకటించుకున్న ముక్కామల వర్గం.

NRI ఆసుపత్రి లుకలుకలు. తెల్లకాగితంపై కమిటీ ప్రకటించుకున్న ముక్కామల వర్గం.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాల, బోధనాసుపత్రిలో పాలకమండలి రెండు వర్గాలుగా విడిపోయింది. వేర్వేరుగా పాలకమండలి సమావేశాలు నిర్వహించి ఎవరికివారు కొత్త కమిటీలను ఎన్నుకున్నారు. పాత కమిటీ పోలవరపు రాఘవరావు అధ్యక్షతన ఎన్నిక కాగా, కొత్త కమిటీ మంతెన నరసరాజు అధ్యక్షతన ఏర్పాటైంది. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని పరస్పరం ఆరోపించుకున్నారు. బోధనాసుపత్రిగా, వైద్య కళాశాలగా 18 సంవత్సరాలుగా సేవలందిస్తోన్న మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీ యాజమాన్యంలో విభేదాలు బయటపడ్డాయి. గత కొద్దిరోజులుగా యాజమాన్య మార్పిడిపై చర్చలు జరుగుతున్నాయి. వాటాల అమ్మకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చర్చలు జరుగుతున్న సమయంలోనే కార్యదర్శి ముక్కాముల అప్పారావుని రెండ్రోజుల క్రితం కమిటీ నుంచి తొలగించారు. కార్యదర్శిగా సురేంద్రను నియమిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పారావు ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు.ఈ నేపథ్యంలో ఇవాళ పాలకమండలి సమావేశం జరిగింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశం జరిగింది. అయితే రెండు వర్గాల వారు వేర్వేరుగా ఈ సమావేశాలు నిర్వహించారు.

#Polavarapu
పోలవరపు రాఘవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 17 మంది పాల్గొన్నారు. అధ్యక్షునిగా పోలవరపు రాఘవరావు, ఉపాధ్యక్షుడిగా నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, కార్యదర్శిగా ఆవుల సురేంద్ర, సంయుక్త కార్యదర్శిగా పిన్నమనేని రామకృష్ణ, కోశాధికారిగా అక్కినేని మణి, సంయుక్త కోశాధికారిగా బసవేశ్వరరావుని ఎన్నుకున్నారు. ఆలపాటి రవి, బిక్కిన సావిత్రి దేవి, కొండ్రగుండ్ల బుచ్చయ్య చౌదరిని సభ్యులుగా ప్రకటించారు. అవతలి వర్గం ఏర్పాటు చేసిన కమిటీకి సాధికారత లేదని రాఘవరావు తెలిపారు. కమిటీలోని కొందరు కళాశాలను అమ్మేందుకు చూస్తున్నారని, దానికి తాము వ్యతిరేకంగా ఉన్నామని రాఘవరావు తెలిపారు.

#Mukkamala
కార్యదర్శి పదవి నుంచి రెండ్రోజుల క్రితం తొలగింపునకు గురైన అప్పారావు ఆధ్వర్యంలో మరో సమావేశం జరిగింది. 9 మందితో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మంతెన నరసరాజు, ఉపాధ్యక్షుడిగా ముక్కాముల పార్థసారధి, కార్యదర్శిగా సోము కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శిగా కోనేరు శ్రీధర్‌, కోశాధికారిగా తిరుపతయ్య చౌదరి, సంయుక్త కోశాధికారిగా అట్లూరి పల్లవి, మరో ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. గతంలో ఉన్న కమిటీ పెద్దలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటి గురించి ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదన్నారు. అందుకే తాము ఇవాళ పాలకమండలి సమావేశం నిర్వహించి కొత్తకమిటీని ఎన్నుకున్నట్టు చెప్పారు. తమ సమావేశానికి 19 మంది హాజరైనట్లు ప్రకటించుకున్నారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సంబంధించి రాఘవరావు వర్గం ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ సైన్సెన్ అనే లెటర్ హెడ్ పై ప్రకటన జారీ చేసింది. నరసరాజు వర్గం మాత్రం తెల్ల కాగితంపై తమ కమిటీని ప్రకటించింది.