* కరోనా సెకండ్ వేవ్ వల్ల రాష్ట్రాల వారీగా విధించిన లాక్డౌన్లో బ్యాంకుల రోజువారి కార్యకలాపాల సమయాన్ని తగ్గించుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బ్యాంకులు సాధారణ స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా లాక్డౌన్ ఆంక్షలున్నప్పటికీ.. బ్యాంకు సమయాలపై ప్రభావం లేదు. ఆర్బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో జులైలో బ్యాంకులు మొత్తం ఏడు రోజులు సెలవుల్లో(Bank Holidays) ఉండనున్నాయి. ఇందులో జులై 21 నాడు బక్రీద్ సందర్భంగా సెలవు. సాధారణంగా ఉండే రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూసివేసి ఉండనున్నాయి. ప్రత్యేక సెలవులు.. 21 జులై 2021- బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు (దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు బ్యాంకులు పని చేయవు)
సాధారణ సెలవులు..
2021 జులై 4 – ఆదివారం
2021 జులై 10 – రెండో శనివారం
2021 జులై 11 – ఆదివారం
2021 జులై 18 – ఆదివారం
2021 జులై 24 – నాలుగో శనివారం
2021 జులై 25 -ఆదివారం
దేశవ్యాప్తంగా…
జులై 12న భువనేశ్వర్, ఇంపాల్
13, 14 తేదీల్లో గ్యాంగ్ టక్
16న దెహ్రాదూన్
17న అగర్తల, షిల్లాంగ్
19న గ్యాంగ్ టక్
20న జమ్ము, శ్రీనగర్, తిరువనంతపురం, కొచ్చి
31 అగర్తల పరిధిలోని బ్యాంకులకు సెలవులు.
స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక తేదీల కారణంగా బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.
* రూ.లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీకి సీఈఓ. కాలు మీద కాలేసుకొని.. కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపే వసతులు. అసలు కంపెనీలో కిందిస్థాయి వర్కర్ల గురించి పట్టించుకునే సమయమూ ఉండకపోవచ్చు. కానీ, అవేవీ ఆయనకు అడ్డు రాలేదు. తన కంపెనీలో ఫుడ్ డెలివరీ విభాగంలో ఓ డెలివరీ బాయ్‌గా చేరిపోయారు. ఉత్సాహంగా తోటి బాయ్స్‌తో పోటీ పడుతూ సమయానికి వినియోగదారులకు ఆహారాన్ని అందించారు. ఆయన ఎవరో కాదు.. ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీ. గత వారాంతంలో సైకిలేసుకొని శాన్‌ఫ్రాన్సిస్కోలో దారా ఖోస్రోషాహీ ఉబర్‌ఈట్స్ తరఫున ఫుడ్ డెలివరీ చేశారు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్లు పంచుకున్నారు. మొత్తం రెండు రోజులు పనిచేశారు. తొలి రోజు 3.5 గంటలు పనిచేసి 10 ట్రిప్పులు డెలివరీ చేశారు. దీంతో ఆయన దాదాపు 100 డాలర్లు సంపాదించారు. అంటే గంటకు సుమారు 30 డాలర్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే గంటకు దాదాపు రూ.2000 సంపాదించారు. ఒక్కో డెలివరీకి కొంత మొత్తం చొప్పున ఉబర్‌ఈట్స్ డెలివరీ బాయ్‌లకు చెల్లిస్తుంది. అలాగే డెలివరీలో భాగంగా ప్రయాణించిన ప్రతి మైల్‌కూ కొంత భత్యంగా ఇస్తుంది. ఖోస్రోషాషీ 2020లో వేతనం, ఇతర భత్యాలు కలపుకొని మొత్తం 12 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.89 కోట్లు) ఆర్జించారు.
* దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. “దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు” కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
* దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్‌కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్‌కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్. సోధి వెల్లడించారు. ఆవు, బర్రె పాలతో పాటు గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటి ధరలు పెరగనున్నాయని చెప్పారు.