Health

గర్భిణులకు కోవిద్ టీకా-TNI బులెటిన్

గర్భిణులకు కోవిద్ టీకా-TNI బులెటిన్

* గర్భిణీలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం వారు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. వీటితోపాటు సమీప కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకా వేయించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం చంటిపిల్లల తల్లులకు మాత్రమే టీకా ఇచ్చేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గర్భిణీలకు కూడా ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

* కరోనాపై కొవాగ్జిన్‌ టీకా 77.8 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఈ మేరకు కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలను విడుదల చేసింది. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో కొవాగ్జిన్‌ టీకా 93.4 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కొవాగ్జిన్‌ తగ్గిస్తోందని వివరించారు.

* కోవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ శుక్రవారం పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పర్యటన, జోరు వానలో కూడా కొనసాగింది. శుక్రవారంతో ఆయన సైకిల్ పర్యటన 44వ రోజుకు చేరింది. యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. కోవిడ్ పేషంట్స్ ను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఉచితంగా నిత్యావసరాలు, పౌష్టికాహారం అందించారు

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 90,532 మంది నమూనాలు పరీక్షించగా 2,930 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.