Politics

ఆంజనేయ స్వామి మాన్యాలు స్వాహా చేస్తున్న వైకాపా దోపిడీదారులు

ఆంజనేయ స్వామి మాన్యాలు స్వాహా చేస్తున్న వైకాపా దోపిడీదారులు

ఆలయ పూజారులకు కేటాయించిన భూమిని అధికార పార్టీ నాయకుడి అండతో ఆయన ఆనుచరులు దౌర్జన్యంగా సాగు చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకునేందుకు పూజారి భార్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కేశన్న కుటుంబీకులు ఏళ్ల తరబడిపూజలు చేస్తున్నారు. ఆలయ మాన్యం 5.30 ఎకరాలలో పంట సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల స్థానిక వైకాపా నాయకుడి అండతో ఆయన అనుచరులు కొందరు సదరు భూమిలో విత్తనం వేసేందుకు ప్రయత్నించారు. తాము వేలంలో భూమిని తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే పూజారి కేశన్న హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో తెచ్చుకున్నారు. అయినప్పటికీ జూన్‌ మొదటి వారంలో దౌర్జన్యంగా పొలాన్ని దున్నేందుకు ప్రయత్నించడంతో కేశన్న పోలీసులను ఆశ్రయించారు. వారు విచారించి పొలంలోకి వెళ్లరాదని మౌఖికంగా సూచించారు. శనివారం మళ్లీ అధికార పార్టీ కార్యకర్తలు పొలంలో విత్తనం వేసేందుకు యత్నించడంతో తాను, తన భార్య ఈశ్వరమ్మ అడ్డుకున్నామని.. ఐదుగురు కలిసి తమపై దాడికి పాల్పడ్డారని కేశన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవమాన భారం భరించలేక తన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు.