WorldWonders

ఇది వృద్ధుల పాఠశాల

ఇది వృద్ధుల పాఠశాల

కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే, మణిపూర్‌లోని కామ్‌జొంగ్‌ జిల్లా, ఛత్రిక్‌ ఖుల్లెన్‌ గ్రామానికి చెందిన సొరింతన్‌ హవ్‌రెయ్‌ అనే కుర్రాడు మాత్రం సేవలోనూ కొత్త దారిని ఎంచుకున్నాడు. ‘లాక్‌డౌన్‌ సమయంలో దిల్లీ నుంచి సొంత ఊరికి వచ్చిన నేను ఇక్కడ వృద్ధులైన ఎంతోమంది ఒంటరిగా ఉండడం చూశాను. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరప్రాంతాలకు వెళ్లిపోవడమే అందుకు కారణం. ఆ ఒంటరితనం వారిని మానసికంగా కుంగదీసింది. అందుకే, ఏదైనా కొత్త వ్యాపకంతో వారికి స్థైర్యాన్నీ, ఆత్మ సంతృప్తినీ ఇవ్వాలనుకున్నా. అలా మొదలైందే వృద్ధుల పాఠశాల’ అంటాడు సొరింతన్‌. తన ట్రస్టు సాయంతో ఊళ్లో ఉన్న వృద్ధులందరినీ ఒప్పించి రోజూ తరగతులు నిర్వహించడం మొదలుపెట్టాడు. వీరిలో దాదాపు ఎవ్వరికీ అక్షరాలూ అంకెలూ రాయడం కూడా రాదట. కానీ నేర్పిస్తుంటే ఎంతో సంతోషంగా నేర్చుకుంటున్నారట. కరోనా కదా… అందరినీ ఒకచోటకు చేర్చి చదువు చెప్పడం ప్రమాదం కదా… అంటారేమో. ఈ ఊళ్లో ఆ సమస్య లేదు. ఎందుకంటే ఊరి నుంచి ఎవరైనా బయట ప్రయాణాలు చేస్తే నెగెటివ్‌ రిపోర్టుతోనే తిరిగి అడుగు పెట్టాలి. అందుకే, ఇక్కడ మొదటి, రెండో వేవ్‌లో కూడా ఒక్క కేసూ రాలేదట.