* గతంలో శ్రీవారి సేవకులు వివిధ బ్యాంకుల్లో ఉచితంగా అందించే సేవలను ఇటీవలె బెంగళూరుకు చెందిన కేవీఎం ఇన్ఫోకాం సంస్థకు తితిదే అప్పగించింది. లడ్డూ కవర్లు మొదలు.. అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించినా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నెలకు రూ. 5 కోట్ల నిర్వహణ వ్యయం చెల్లించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో లడ్డూ విక్రయ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందుతాయని భక్తులు ఆశించారు. దర్శన లడ్డూలు, అదనపు లడ్డూలు, వడ, కవర్ల కోసం కౌంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని భావించారు. ప్రైవేటు ఏజెన్సీ బాధ్యతలు తీసుకొని రెండు వారాలు గడుస్తున్నా సేవల తీరు మాత్రం మారలేదని భక్తులు వాపోతున్నారు. ‘‘లడ్డూలు ఒక చోట.. కవర్లు మరో చోట ఇస్తున్నారు. వడ కావాలంటే మేడ మీదకు వెళ్లాలంటున్నారు. ఇలా రకరకాలుగా భక్తుల సౌకర్యార్థం కాకుండా వారికి అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలు భక్తులకు అసౌకర్యంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రసాదాలన్నీ ఒకే చోట ఇవ్వగలిగితే బాగుంటుంది. అందులోనూ ప్రస్తుత కరోనా సమయంలో అక్కడా.. ఇక్కడా అని కాకుండా ఒకే చోట ప్రసాదాలు విక్రయిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రైవేటుకు అప్పగించినా సేవల్లో ఎలాంటి మార్పులు రాకపోతే తితిదేపై నిర్వహణ భారం పడటం తప్ప ఉపయోగం ఏముంటుంది’’ అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
* మరికొన్ని రోజుల్లో ఐపీఓకి రానున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎంలో కీలక పదవుల్లో ఉన్న పలువురు రాజీనామా చేస్తుండడం ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ప్రెసిడెంట్ అమిత్ నాయర్ గత నెలలో రాజీనామా చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను వైదొలుగుతున్నట్లు లేఖలో నాయర్ పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సంస్థ నుంచి మానవ వనరుల విభాగం చీఫ్ రోహిత్ ఠాకూర్ సైతం వైదొలిగిన విషయం తెలిసిందే.
* దేశంలో ఇంధన వినియోగం పుంజుకుంటోంది. లాక్డౌన్ నిబంధనల సడలింపులతో దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో ఇంధన వినియోగం దాదాపు 8 శాతం మేర పెరిగింది. గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగి 16.33 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఈ మేరకు పెట్రోలియం శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్సెల్ తాజాగా జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.
* ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. లీటరు పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచి దేశ రాజధాని దిల్లీ సహా వివిధ పట్టణాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. పాడి రైతుల వద్ద కొనుగోలు ధర సహా ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగానే ధరలను పెంచుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సంస్థ నుంచి వస్తున్న అన్ని రకాల పాలపై ధర పెరగనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో లీటరు రూ.42గా ఉన్న బల్క్ వెండెడ్పాల ధర రూ.44కు చేరనుంది. పాలీ ప్యాక్ లీటరు రూ.55 నుంచి రూ.57కి.. టోన్డ్ మిల్క్ ధర రూ.45 నుంచి రూ.47కు పెరిగింది. 2019 డిసెంబరు తర్వాత మదర్‌డెయిరీ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. ఇటీవల మరో ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ సైతం లీటర్‌పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే.
* దేశ భద్రత, సైబర్ సెక్యూరిటీ పేరిట బడా సాంకేతిక సంస్థలపై విరుచుకుపడుతున్న చైనా.. తాజాగా మరో 25 యాప్‌లను తొలగించాలని యాప్ స్టోర్లను ఆదేశించింది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ‘దీదీ గ్లోబల్’ యాప్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అదే దీదీకి చెందిన మరో 25 అనుబంధ యాప్‌లను కూడా తొలగించాలని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలపై నిఘా కొనసాగుతుందని గత వారం చైనా పేర్కొంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు పేరిట చైనీయులకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్నది చైనా ప్రభుత్వ ఆరోపణ.