* నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లపైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ఉండే విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది గ్రావ్‌టన్ మోటార్స్. హైదరాబాద్‌కు చెందిన ఈ అంకురం తన తొలి విద్యుత్ వాహనం ‘క్వాంటా’ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు అవలీలగా దూసుకుపోవచ్చని వెల్లడించింది. లిథియం-ఐయాన్ బ్యాటరీని రిబ్‌డ్ ఛాసిస్‌లో బిగించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ సీఈఓ పరశురామ్ పాక తెలిపారు. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం అనే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ ఆన్‌లైన్ వెబ్‌సైటు ద్వారా బుకింగ్‌లు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ‘విద్యుత్ వాహనాన్ని వినియోగించే వారికి ప్రధానంగా ఇంకా ఎంత దూరం వెళ్లగలం అనే ఆందోళన ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే.. సగటున 120 కిలోమీటర్ల కన్నా అధికంగా ప్రయాణించాలని మా సర్వేలో తేలింది. అందుకు తగ్గట్టుగానే ఈ వాహనాన్ని రూపొందించాం. బీఎల్‌డీసీ మోటార్ 3 కిలోవాట్ (4బీహెచ్‌పీ) శక్తిని విడుదల చేస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ఠ వేగం దీని సొంతం. మూడు గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది. అదనంగా మరో బ్యాటరీని బిగించుకునే వీలూ ఇందులో ఉంది’ అని పరశురామ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంటులో నెలకు 2,000 యూనిట్లు తయారీ సామర్థ్యం ఉందని, దీన్ని విస్తరించి, 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీని ధర రూ.99,000లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
* మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అందించే ఆరోగ్య బీమా పాలసీలను యాక్సిస్ బ్యాంకు తన శాఖలలో విక్రయించనుంది. ఈ మేరకు రెండు సంస్థలూ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా యాక్సిస్‌కు చెందిన 4,500లకు పైగా శాఖల్లో మ్యాక్స్ బూపా పాలసీలు ఖాతాదారులకు లభించనున్నాయి. కొవిడ్-19 తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటిని సులభంగా తీసుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని మ్యాక్స్ బూపా వెల్లడించింది.
* డి-మార్ట్ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.95.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.40.08 కోట్లతో పోలిస్తే లాభం రెట్టింపునకు పైగా పెరగడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.3,883.18 కోట్ల నుంచి పెరిగి రూ.5,183.12 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ.5,077.22 కోట్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇవి రూ.3,875.01 కోట్లుగా ఉన్నాయి. స్టాండలోన్ పద్ధతిలో ఆదాయం రూ.3,833.23 కోట్ల నుంచి రూ.5,031.71 కోట్లకు పెరిగింది. ‘ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయల్లో 31 శాతం వృద్ధి ఉంది. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా కార్యకలాపాల సమయం తక్కువగా ఉన్నప్పటికీ.. ఏడాదిక్రితంతో పోలిస్తే అమ్మకాలు ఎక్కువగా నమోదుకావడం ఆదాయాల్లో వృద్ధికి తోడ్పడింద’ని అవెన్యూ సూపర్‌మార్ట్స్ తెలిపింది. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు జరుగుతుండటంతో.. నిల్వలు క్రమక్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని పేర్కొంది.
* కొత్త ప్రాజెక్టుల కొనుగోలు, అభివృద్ధి నిమిత్తం వచ్చే రెండేళ్లలో బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్లు)కు పైగా పెట్టుబడులు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్థిరాస్తి దిగ్గజం గోద్రేజ్ ప్రోపర్టీస్ వెల్లడించింది. అధిక వృద్ధి సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పిరోజ్‌షా గోద్రేజ్ తెలిపారు. విలువ, అమ్మకాల పరంగా భారత్‌లోనే అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా గోద్రేజ్ ప్రోపర్టీస్ మొట్టమొదటిసారిగా నిలిచిందని కంపెనీ వార్షిక నివేదికలో అన్నారు. కొవిడ్ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాల బుకింగ్‌లు 14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.6,725 కోట్లుగా నమోదయ్యాయి. ఈ క్రమంలో మ్యాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) రూ.6000 కోట్ల అమ్మకాలను అధిగమించింది. క్యూఐపీ ప్రక్రియ ద్వారా మార్చిలో రూ.3,750 కోట్లు సమీకరించినట్లు పిరోజ్‌షా గుర్తుచేశారు. 2020-21లో వ్యాపారాభివృద్ధి మోస్తారుగా ఉందని తెలిపారు. 2021-22 వ్యాపారాభివృద్ధికి బలమైన ఏడాదిగా ఉండొచ్చని అంచనా వేశారు.
* తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) సిద్ధపడుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ), తన ఖాతాల్లో ఉన్న మొండి బాకీలను వదిలించుకునే పనిలో నిమగ్నమైంది. ఇందులో డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఆర్‌కామ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తదితర 15 సంస్థలకు చెందిన బాకీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రుణాలకు ఎల్‌ఐసీ తన ఖాతాల్లో నూరు శాతం కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేసింది. ఇక దశల వారీగా ఈ ఖాతాలను అసెట్ రీ-కన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు విక్రయించాలని నిర్ణయించింది. ఎల్‌ఐసీ తరపున ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ బాధ్యత చేపట్టింది.