తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తన పదవి నుండి విరమణ తీసుకున్నారు. తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరికి తానా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఆయన ఫేస్‌బుక్‌లో తన హయాంలో తానా బలోపేతానికి కృషి చేసి, సేవా కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ సందేశం దిగువ చూడవచ్చు.
అందరికీ నమస్కారాలు…తానా అధ్యక్షుడిగా నా పదవీకాలం ఈరోజుతో ముగుస్తుంది.ఈ రెండేళ్ళకాలం పాటు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించిన తానా సభ్యులకు,కార్యవర్గ సభ్యులకు, దాతలకు, వాలంటీర్లకు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తానా అధ్యక్షులుశ్రీ అంజయ్య చౌదరి గారికి,వారి కార్యవర్గ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన తెలుగు సంస్థ తానా అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేసి, తెలుగు వారికి సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు.మీరిచ్చిన ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమర్థంగా నా పాత్రను నిర్వహించానన్న సంతృప్తి నాకు ఉంది.నా పూర్తి శక్తి సామర్ధ్యాలను, సమయాన్ని వెచ్చించి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి తానా ప్రతిష్టను ఇనుమడింప చేయగలిగానని నేను భావిస్తున్నాను.మా కార్యవర్గ సభ్యులు అందరూ కలసితానా పట్ల అందరిలో విశ్వసనీయత పెంచడానికి, తానా సేవలను విశ్వవ్యాప్తం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాము.సఫలీకృతులం అయ్యాము.అందులో ఎటువంటి సందేహం లేదు.తెలుగు భాషా, సాహిత్యం, సంస్కృతులను పరిరక్షించటం,భావితరాలకు అందించడం అనే తానా మిషన్ స్టేట్మెంట్ అమలు చేయడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయగలిగాము. నూతన వ్యవస్థలను ఏర్పాటుచేయగలిగాము.”అమ్మానాన్న గురువు పద్యార్చణ” ఆరు లక్షల మంది బాలబాలికలతో అపూర్వంగా నిర్వహించాము. అమెరికాలో తెలుగు భాషా పునాదుల కోసం ఉద్దేశించిన “పాఠశాల”, మరియు కళాశాల వ్యవస్థలనువ్యయ ప్రయాసలకు వోర్చిపునర్వ్యవస్థీకరణ చేశాము.యువతరం కోసంSAT, ACT వంటి ఫ్రీ కోచింగ్ శిబిరాలు నిర్వహించాము.”తానా మ్యా ట్రిమోనీ” లాంటి ఎంతో ప్రయోజనకరమైన వ్యవస్థలను రూపొందించాము.”అమెరికాలో బాలోత్సవం”,” పర్యావరణ దినోత్సవం”,”ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం” (40 దేశాలలో ఉన్న వంద సంస్థలతో కలిసి) వంటి ఎన్నో ఎన్నెన్నో అసంఖ్యాకమైన కార్యక్రమాలు నిర్వహించాము.ప్రపంచంలో ఉన్న తెలుగు భాషాభిమానులను, తెలుగు కవులను, రచయితలు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ఉద్దేశంతో”తానా ప్రపంచ సాహిత్య వేదిక”ను నిర్మించి ప్రతినెలా నిర్విఘ్నంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.సాహితీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా “ప్రపంచ మహాకవి సమ్మేళనం-21″( 23 దేశాల 21 సంస్థలతో కలిసి) నిర్వహించాము.సాహిత్య రంగంలో, భాషా సేవా రంగంలో మునుపెన్నడూ లేని ఉత్సాహాన్ని నింపగలిగాము.కోవిడ్ ఫస్ట్ వేవ్ లో తానా ఫౌండేషన్ సమన్వయంతో లక్షలాది మందికి అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ, లక్షల మాస్కులు పంపిణీ చేసాము. కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్షిజన్ కాంసెంట్రెటర్లు, వెంటిలేటర్లు విరివిగా తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేసాము.ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించగలిగాము.తానా మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరిక మాకు ఉంది. కానీ అది జరిగే పరిస్థితులు ఈనాడు లేవని మీ అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో మన వారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మనం ఇక్కడ ఉత్సవాలు జరిపించడం అంతా శ్రేయష్కరం కాదనిపించింది.ఈ పరిస్థితుల్లో ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మంచి పని కాదని పించింది.రెండేళ్ల కాలంలో ఎంతోమంది గొప్ప వారితో కలిసి పని చేసే అవకాశం నాకు కలిగింది. ఎన్నో నేర్చుకున్నాను. మీరు నామీద చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. పదవిలో ఉన్నా లేకపోయినా తానా సేవ కోసం నేను ఎప్పుడూ ముందు ఉంటానని తెలియజేసుకుంటూ..సెలవు తీసుకుంటున్నాను.
నమస్కారం.
మీ
తాళ్ళూరి జయశేఖర్,
అధ్యక్షుడు (2019-21)తానా