అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021-23 అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా పెద్దవుటపల్లికి చెందిన అట్లాంటా ప్రవాసాంధ్రుడు లావు అంజయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మిత్రులు, ఉత్తర అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాసులు శుభాకాంక్షలు అందజేశారు.
తానా సేవా కార్యక్రమాల వ్యాప్తిని విస్తరిస్తానని, సంస్థతో సభ్యుల అనుసంధానాన్ని పెంపొందిస్తానని, భావితరాలకు చేరువ చేసి తద్వారా సంస్థ “లావు” ఎక్కేలా దీర్ఘకాల ప్రయోజనాలు అందించేలా తానా బలోపేతానికి అలుపెరుగక కృషి చేస్తానని అంజయ్య చౌదరి పేర్కొన్నారు. TANA Emergency Assistance Management(TEAM Square) ద్వారా ఎందరికో ఆపత్కాలంలో నేనున్నానని సేవ చేసిన “టీం స్క్వేర్” అంజయ్య అదే పంథాలో ముందుకు సాగుతానని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ధైర్యంగా నిలబడతామని భరోసానిచ్చారు.
*** నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఉన్న పెద్దఅవుటుపల్లి గ్రామంలో లావు సాంబశివరావు – శివరాణి దంపతులకు 1971 మార్చి 27 న అంజయ్య చౌదరి జన్మించారు. తండ్రి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా విశాఖపట్నంలో పనిచేయడం వలన అంజయ్య చౌదరి బాల్యం పినతండ్రి చెంత పెద్దావుటపల్లిలోనే గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసమంతా గన్నవరంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో, ఉన్నత విద్య బీటెక్ బళ్ళారి లోను, ఎంటెక్ గుల్బర్గా కళాశాలలో పూర్తిచేశారు. 1988లో అమెరికాకు వెళ్లిన ఆయన 1997లో అనకాపల్లికి చెందిన నటాషాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీకాంత్ చౌదరి, కుమార్తె అక్షిణ శ్రీ చౌదరి. స్వగ్రామంలో ఆరోగ్య శిబిరాలతో పాటు, పేద విద్యార్థులకు విద్యా సాయం, అన్నదానం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.
*** తానాతో అనుబంధం
తానాలో టీమ్ స్క్వేర్ చైర్మన్ గా అంజయ్య ప్రస్థానం మొదలైంది. ఆయన చేపట్టిన ఇతర పదవులు దిగువ చూడవచ్చు….
“తానా” టీమ్ స్క్వేర్ చైర్మన్ (2011-13)
“తానా” సంయుక్త కోశాధికారి ( 2013-15)
“తానా” టీమ్ స్క్వేర్ మెంటర్ చైర్మన్ (2013 -15 )
“తానా” కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ (2015 – 17 )
“తానా’ టీమ్ స్క్వేర్ కో చైర్ (2015 – 17)
“తానా” జనరల్ సెక్రటరీ (2017 – 19)
తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ ( 2017 -19)
“తానా” ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (2019 – 21 )
“తానా” ప్రెసిడెంట్ ( 2021 -23)
రానున్న రోజుల్లో తానా కీర్తి బావుటా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిపేందుకు, తానా యశస్సు దశదిశలా వ్యాప్తి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, దీనికి సభ్యుల తోడ్పాటు అవసరమని అంజయ్య చౌదరి పేర్కొన్నారు.